మలప్పురం : కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించిన వారికి పునరావాసం కల్పించాలనే డిమాండ్ చేస్తూ 75 ఏళ్ల మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఆర్ మనోహరన్ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. కేరళలోని అలప్పుజా నివాసి ఆర్ మనోహరన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… తను కమ్యూనిస్టుననే కారణంతో 52 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించారని ఆయన పేర్కొన్నారు. మనోహరన్ 1969లో ఇండియన్ ఆర్మీలో చేరారు. కమ్యూనిస్టు అని కారణంతో 1971లో మద్రాసు ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ నుండి తొలగించారు. 1972లో బొంబాయి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం సాధించిన ఆయనను తొమ్మిది నెలల్లోనే అతడిని తొలగించారు. అప్పట్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. అప్పట్లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆలస్యమైనా న్యాయ నిరాకరణను ప్రశ్నించడానికే ఈ యాత్ర అని మనోహరన్ అన్నారు. ఆగస్టు 15న కాసరగోడ్ తాళ్లప్పాడి నుంచి యాత్ర ప్రారంభమైంది. నవంబర్ నాటికి తిరువనంతపురం చేరుకోనున్నట్లు తెలిపారు.
