- ఏచూరి సంతాప సభలో కేరళ సిఎం పినరయి విజయన్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిది ఎల్లలు లేని సోదరభావమని, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారిలో ఆయన ఒకరని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. సిపిఎం కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన తిరువనంతపురంలో సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది. సిపిఎం సీనియర్ నేత, పొలిట్ బ్యూరో మాజీ సభ్యులు ఎస్ రామచంద్రన్ పిళ్లై అధ్యక్షతన జరిగిన ఈ సభలో పినరయి విజయన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని వివిధ దేశాల కమ్యూనిస్టు నేతలతో ఏచూరికి అత్యంత సన్నిహిత సంబంధాలుండేవని అన్నారు. ప్రధాన కార్యదర్శి కాకముందు కూడా ఇతర దేశాల్లోని సోదర పార్టీలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారని గుర్తుచేశారు. అనేక దేశాల సమస్యలపైనా ఆయన స్పందించారని అన్నారు. విద్యార్థి రోజుల నుంచే ఏచూరి నాయకత్వ పటిమకు గుర్తింపు వచ్చిందని, వరుసగా మూడుసార్లు జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులుగా రికార్డు సృష్టించారని తెలిపారు. భారతదేశంలోని మేధావుల్లో ఆయన ప్రముఖుడైనప్పటికీ, ఆయన అలాంటి వైఖరి ప్రదర్శించలేదని పేర్కొన్నారు. తనకు భిన్నాభిప్రాయాలున్న అంశాలపై చర్చించేటప్పుడు చిరాకు పడకుండా ప్రజెంట్ చేయగల నేత సీతారాం ఏచూరి అని అన్నారు. కేరళలో ఏచూరికి నేరుగా తెలిసిన పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారని, కేరళలో సిపిఎం ఎదుగుదలలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఏచూరి మరణం సిపిఎంకే కాకుండా ప్రస్తుత భారతదేశ పరిస్థితిలో అన్ని లౌకిక ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. సీతారాం ఏచూరి మృతి సిపిఎం, వామపక్ష ఉద్యమాలకే కాకుండా లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం సీనియర్ నేత ఎస్ రామచంద్రన్ పిళ్లై అన్నారు. ఏచూరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏచూరి చాలా సమర్థుడైన రాజకీయ నాయకుడని, వామపక్ష రాజకీయ పార్టీలతోపాటు, లౌకిక, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలతో స్నేహపూర్వకంగా ఉండటానికి, కలిసి ఆందోళనలోకల పాల్గొనడానికి ఆయన సమర్థవంతంగా కృషి చేశారని అన్నారు.
దేశం చూసిన ప్రతిభావంతులైన రాజకీయ నాయకుల్లో ఒకరు : ఎంవి గోవిందన్
విద్యార్థి ఉద్యమంతో వామపక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రతిభావంతులైన రాజకీయ నాయకుల్లో సీతారాం ఏచూరి ఒకరని సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ మాస్టర్ అన్నారు. ఏచూరి ఒక తెలివైన కమ్యూనిస్టు, తాత్విక, సంస్థాగత, ఆచరణాత్మక విషయాలపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఏచూరి జాతీయ రాజకీయాల్లో సరైన దిశానిర్దేశంతో పనిచేశారని, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించారన్నారు. సిపిఐ నేత పన్నయ్య రవీంద్రన్ మాట్లాడుతూ.. రాజకీయాలు, విద్యారంగంలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా అపారమైన జ్ఞానం ఉన్న నాయకుడు ఏచూరి అని అన్నారు. వామపక్ష, లౌకిక ఉద్యమాలతో ఏకీభవించే అన్ని పార్టీలతో నేరుగా చర్చలు జరపగలిగారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, ఎ విజయరాఘవన్, రాష్ట్ర మంత్రి రామచంద్రన్ కదనపల్లి, ఆర్‌ఎస్‌పి కేంద్ర కమిటీ సభ్యులు కెఎస్ సనల్‌కుమార్, ఎఐసిసి కార్యదర్శి పిసి విష్ణునాథ్, కేరళ కాంగ్రెస్ నాయకులు ఎన్ జయరాజ్, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే పిసి విష్ణునాథ్, ఐయుఎంఎల్ ప్రధాన కార్యదర్శి పిఎంఎ సలమ్, ఎన్‌సిసి నేత పిసి చాకో, జెడిఎస్ నేత మాథ్యూ టీ థామస్, కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మోన్స్ జోసెఫ్, ఐఎన్‌ఎల్ ప్రధాన కార్యదర్శి కాసిం ఇర్కూర్, కేరళ కాంగ్రెస్ (స్కారియా థామస్) ఛైర్మన్ బెనోరు జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.