కార్మిక పోరాట యోధునికి తుది వీడ్కోలు

  • ఢిల్లీలో ముగిసిన తివారి అంత్యక్రియలు
  • బృందాకరత్‌, తపన్‌సేన్‌ ప్రభృతుల నివాళి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కార్మిక వర్గం కోసం జీవిత చరమాంకం వరకు పోరాడిన యోధుడు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కెఎం తివారీకి పార్టీ కార్యకర్తలు, ప్రజలు, బంధువులు తుది వీడ్కోలు పలికారు. ఢిల్లీలో మంగళవారం మరణించిన తివారీకి బుధవారం పలువురు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సందర్శనార్థం తొలుత ఆయన భౌతికకాయాన్ని సిపిఎం ఘజియాబాద్‌ జిల్లా కమిటీ కార్యాలయంలోనూ, అనంతరం ఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లోనూ ఉంచారు.
ఈ సందర్భంగా సిపిఎం, సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, డిఎస్‌ఎంఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్‌, ఆర్‌ఎస్‌పి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వందలాదిగా తరలివచ్చి ప్రజా ఉద్యమనేతకు నివాళులర్పించారు. ఆ తర్వాత నిగంబోధ్‌ ఘాట్‌కు వరకు అంతిమయాత్ర సాగింది. దారిపొడువునా ప్రజా నీరాజనాలతో ఈ యాత్ర సాగింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌, తపన్‌సేన్‌, అశోక్‌ ధావలే, నీలోత్పల్‌ బసు, కేంద్ర కమిటీ సభ్యులు కె హేమలత, మరియం ధావలే, కె రాధాకృష్ణన్‌ (ఎంపి), ఆర్‌ అరుణ్‌కుమార్‌, బి వెంకట్‌, మురళీధరన్‌, ఎఆర్‌ సింధు, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్‌ సక్సేనా, ఎంపి వి శివదాసన్‌ తదితరులు ఘనంగా నివాళులర్పించి ఉద్యమ సహచరుడికి తుది వీడ్కోలు పలికారు.

సిఐటియు, ఎఐకెఎస్‌ సంతాపం

తివారీ మృతి పట్ల సిఐటియు, ఎఐకెఎస్‌ సంతాపం తెలిపాయి. నిబద్ధత కలిగిన ఉద్యమకారుడిగా తివారీ జీవితం యువ తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాయి. దేశ రాజధానిలో విప్లవోద్యమానికి తివారీ మరణం తీరని లోటు అని సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.హేమలత, తపన్‌ సేన్‌, ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజూ కృష్ణన్‌ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

➡️