నీట్‌ ఫలితాలపై నలుగురితో కమిటీ

  • అక్రమాలపై ఫిర్యాదులతో పరిష్కారానికి కేంద్రం చర్యలు

న్యూఢిల్లీ : నీట్‌ యుజి 2024 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటి పరిష్కారానికి నలుగురితో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) శనివారం ప్రకటించాయి. పరీక్షా సమయాన్ని కోల్పోయి ఇబ్బంది పడడంతో గ్రేస్‌ మార్కులు ఇచ్చిన 1563మంది అభ్యర్ధుల ఫలితాలను ఈ కమిటీ పున:పరిశీలిస్తుందని తెలిపాయి. ఈ కమిటీలో యుపిఎస్‌సి మాజీ చైర్మన్‌, మరో ముగ్గురు విద్యావేత్తలు సభ్యులుగా వున్నారు. కమిటీ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. వచ్చే శనివారంలోగా తీర్పును వెలువరించవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ కమిటీ ఇచ్చే తీర్పు వల్ల ఇతరుల ఫలితాలపై ఎలాంటి ప్రభావం వుండబోదని ఎన్‌టిఎ పేర్కొంది. ఎంబిబిఎస్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని తెలుసని అందువల్లే వచ్చే శనివారంలోగానే తీర్పు వస్తుందని, దానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, దీనివల్ల ఆడ్మిషన్‌ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా వుండేందుకు ప్రయత్నిస్తామని ఎన్‌టిఎ చీఫ్‌ సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఇప్పటివరకు, నార్మలైజేషన్‌ ఫార్ములా ప్రాతిపదికన మొత్తంగా 1563 మంది విద్యార్ధులకు గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. ఇలా చేయడం వల్ల వీరిలో ఆరుగురికి ఉన్నత ర్యాంకులు వచ్చాయి. అయితే ఆ ఫార్ములా వివరాలను ఎన్‌టిఎ ఇంతవరకు వెల్లడించలేదు. ఆరు కేంద్రాల్లో 1563మంది విద్యార్ధులు ఈ సమస్యను ఎదుర్కొన్నారని వెల్లడైంది. ఈ కేంద్రాలు చత్తీస్‌ఘడ్‌లో రెండు, మేఘాలయ, సూరత్‌, హర్యానా, చండీఘడ్‌ల్లో ఒక్కోటి వున్నాయి.
ఇదిలావుండగా నీట్‌ యుజి ఫలితాల వివాదం కోర్టుకు చేరింది. అనేకమంది విద్యార్ధులు పలు హైకోర్టుల్లో పిటిషన్లు వేశారు. ప్రస్తుతానికి, ఢిల్లీ హైకోర్టులో నీట్‌ అభ్యర్ధి వేసిన రిట్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లో 29వ నెంబరు ప్రశ్నకు ఫైనల్‌ ఆన్సర్‌ కీని ఆ పిటిషనర్‌ సవాలు చేశారు. అలాగే కొద్ది సెంటర్లలో అభ్యర్ధులకు ఇచ్చిన అదనపు సమయాన్ని కూడా సవాలు చేశారు. దీనిపై నోటీసులు జారీ తర్వాత 12వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేశారు. కలకత్తా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో మరో పిల్‌ దాఖలైంది. అందులో కొంతమంది అభ్యర్ధులకు 718 లేదా 719 మార్కులు ఇవ్వడాన్ని పిటిషనర్‌ సవాలు చేశారు. దీనిపై 6న విచారణ జరగ్గా, ఎన్‌టిఎ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి హైకోర్టు 10రోజులు గడువు ఇచ్చింది. రెండు వారాల తర్వాత దీనిపై తదుపరి విచారణ జరగనుంది.సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై ప్రతివాదులకు మే 17న నోటీసులు జారీ చేసిన సుప్రీం జులై 8కి విచారణను వాయిదా వేసింది. షెడ్యూల్డ్‌ తేదీ కన్నా 10 రోజులు ముందుగానే జూన్‌ 4న నీట్‌ ఫలితాలు వెలువడ్డాయి. జాతీయ స్థాయిలో ఏకంగా 67మందికి ఫస్ట్‌ ర్యాంకులు దక్కాయి. వీరిలో 17మందికి మెరిట్‌ ద్వారా ర్యాంక్‌ రాగా, ఫిజిక్స్‌ సెక్షన్‌లో తప్పుడు సమాధానం కారణంగా 44మంది విద్యార్ధులకు ర్యాంక్‌ వచ్చింది. పరీక్ష సమయాన్ని కోల్పోయిన కారణంగా గ్రేస్‌ మార్కులు ఇవ్వడంతో మరో ఆరుగురికి ర్యాంక్‌ వచ్చింది.

➡️