పాట్నా : బీహార్‌లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. జువెల్లరీ షోరూమ్‌లోకి ప్రవేశించి కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన సోమవారం ఉదయం అరానిలోని తనిష్క్ షోరూమ్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 10:30 గంటలకు తనిష్క్ షోరూమ్‌ను తెరిచారు. ఆ సమయంలో షోరూమ్ కు కొందరు కస్టమర్లు కూడా వచ్చారు. అదే సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది ముసుగులు, హెల్మెట్లతో ముఖాలను కప్పుకుని షాప్‌లోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకుని.. షోరూమ్‌లోని సిబ్బందిని, కస్టమర్లను తుపాకీతో బెదిరించారు. అనంతరం అక్కడున్న బంగారాన్నంతా తమ సంచుల్లో నింపుకుని ఉడాయించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
చోరీకి గురైన బంగారం విలువ రూ.25 కోట్లు ఉంటుందని షోరూమ్ మేనేజర్ కుమార్ మృత్యుంజయ్ తెలిపారు. బంగారు ఆభరణాలతోపాటు కొంత నగదును కూడా దొంగల ముఠా తీసుకెళ్లిపోయినట్లు ఆయన చెప్పారు. అయితే, ఎంత మొత్తం సొమ్ము పోయిందన్నది ఆయన వెల్లడించలేదు. చోరీ సమయంలో దొంగల ముఠాకు తెలియకుండా పోలీసులకు ఫోన్ చేసినట్లు సిబ్బంది ఒకరు తెలిపారు. దాదాపు 25 నుంచి 30 కాల్స్ చేసినట్లు చెప్పారు. షోరూమ్‌కు 600 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ వారు సమయానికి రాలేదని ఆరోపించారు. ఫలితంగా దొంగల ముఠా ఆభరణాలతో అక్కడినుంచి పారిపోయినట్లు పేర్కొన్నారు.