1న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం?
న్యూఢిల్లీ / ముంబయి : మహారాష్ట్రలో ముఖ్యమంత్రి విషయంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్ 1న కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశముంది. ఆ రోజే నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే సిఎం ఎవరనే విషయమే ఇప్పుడు తేలాల్సివుంది. అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సిపి (అజిత్ పవార్) గ్రూపు నేత అజిత్ పవార్ ముగ్గురు నేతలూ పోటీలో ఉండటంతో పీఠ ముడి తెగడం లేదు. అయితే బిజెపి అధినాయకత్వం ప్రత్యేక ప్రతినిధిని ముంబయికి పంపి వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం..కొత్త ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రులు, 20 మంది క్యాబినెట్ మంత్రులు కూడా వచ్చే డిసెంబరు 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 10 మంది బిజెపి ఎమ్మెల్యేలకు, ఆరుగురు షిండే సేన ఎమ్మెల్యేలకు, నలుగురు అజిత్ పవార్ నేతృత్వ ఎన్‌సిపి ఎమ్మెల్యేలకు క్యాబినెట్ పదవులు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి పదవిపై కొన్ని గంటల్లోనే స్పష్టత వస్తుందని శివసేన నాయకుడు సంజరు షిర్‌సత్ మంగళవారం సాయంత్రం చెప్పారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర బిజెపి సీనియర్ నాయకులను సంప్రదించిన తర్వాత ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, ఫడ్నవీస్ సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా ముఖ్యమంత్రిని ప్రకటించే విషయంలో తొందరపాటు ప్రదర్శించరాదని బిజెపి భావిస్తోంది.
అవి బిజెపి సబ్ కంపెనీలు : శివసేన (యుబిటి) వ్యంగ్యాస్త్రాలు
తాజా పరిణామాలపై ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి) వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆ పార్టీ ఎంపీ సంజరు రౌత్ ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ ‘బిజెపికి భాగస్వామ్య పక్షాలుగా ఉండడంతో షిండే సేన, అజిత్ ఎన్‌సిపి పార్టీలు ముఖ్యమంత్రిని తేల్చుకోలేకపోతున్నాయి. అవి బిజెపికి సబ్-కంపెనీ లుగా మారిపోయాయి. ముఖ్యమంత్రిని అమిత్ షా, నరేంద్ర మోడీ నిర్ణయిస్తారు. షిండే, అజిత్ పవార్ స్వీయ నిర్ణయాలు తీసుకోలేరు. ఈ రెండు పార్టీలు అమిత్ షా, మోడీలకు బానిసలు’ అని విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రిని నిర్ణయించడంలో జాప్యం జరగడం అనవసరమని పిసిసి అధ్యక్షులు నానా పటోలే చెప్పారు.