ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Jun 9,2024 08:54 #3 death, #Delhi, #Fire Accident
  • ముగ్గురు కార్మికులు మృతి
  • ఆరుగురికి గాయాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని నరేలా ప్రాంతంలో ఒక ఆహార శుద్ధి పరిశ్రమలో శనివారం ఉదయం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు పరిశ్రమలోని మరికొందరికి కూడా గాయలయ్యాయని అధికారులు తెలిపారు. నరేలా పారిశ్రామిక వాడలోని పెసర పప్పు పరిశ్రమలో శనివారం ఉదయం 3.38 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, సమాచారం అందిన వెంటనే 16 అగ్నిమాపక బృందాలతో అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ (డిఎఫ్‌ఎస్‌) ఛీఫ్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. పరిశ్రమలో ఉన్న ఒక పైపు నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు అలుముకొని, కంప్రెషర్‌ వేడిక్కిపోవడంతో భారీ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు ఆయన తెలిపారు. మంటల్లో చిక్కుకున్న పరిశ్రమ నుంచి మొత్తం 9 మందిని బయటకు తీసుకొచ్చామని, వారిలో అప్పటికే తీవ్ర గాయాలవ్వడంతో ముగ్గురు చనిపోయారని, మిగిలిన ఆరుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయని, వారిని సఫ్దర్‌గంజ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఔటర్‌ నార్త్‌ డిప్యూటీ కమిషనర్‌ రవి కుమార్‌ తెలిపారు. చనిపోయిన కార్మికులను వీర్‌పాల్‌ (42), శ్యామ్‌ (24), రామ్‌ (30)గా గుర్తించారు. ఈ పరిశ్రమ యజమానులను రోహిని ప్రాంతానికి చెందిన అంకిత్‌ గుప్తా, వినరు గుప్తా గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

➡️