రాంఛి : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే ఇక్కడి వనరులను బడా కార్పొరేట్లు దోపిడి చేస్తారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. సిపిఎం అభ్యర్థి లఖన్ లాల్ మండల్‌కు మద్దతుగా జమ్తాడ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బృందాకరత్ ప్రసంగించారు. కాబట్టి బిజెపి అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఓడించి తీరాలని, కాషాయ నేతల చొరబాటును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలతో నిత్య వనరులను కాపాడుతూ వస్తున్న సిపిఎంను గెలిపించాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కాకుండా బిజెపి మతతత్వ అజెండాతో ప్రచారం దట్టిస్తోందని, ఆదివాసీలకు, ఇతర సామాజిక తరగతుల ప్రజలకు మధ్య చిచ్చురాజేసి జార్ఖండ్‌లో కాషాయ పార్టీ లబ్ది పొందాలని కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. ప్రజలందరికీ విద్య, ఆరోగ్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై రాజకీయ నేతలు దృష్టి సారించేలా ప్రజలు డిమాండ్ చేయాలని, అలాంటి ప్రజా సమస్యలపై చర్చ జరగాలని బృందాకరత్ అన్నారు.
