దండకారణ్యం రక్తసిక్తం

Mar 20,2025 23:52 #Chhattisgarh, #encounter, #Maoists
  • ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మృతి
  • డిఆర్‌జి జవాన్‌ కూడా
  • మూడు నెలల్లో 77 మంది మరణం
  •  125కు పైగా గ్రామాల్లో హిడ్మా కోసం సెర్చ్‌ ఆపరేషన్‌

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో, చర్ల : పచ్చటి అడవులు రక్తసిక్తమయ్యాయి. తాజాగా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, కాంకేర్‌ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు, ఓ డిఆర్‌జి జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. 2026 నాటికి మావోయిస్టుల్లేకుండా చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశాలతో.. దండకారణ్యంలోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది.

ఏం జరిగింది..?

బీజాపూర్‌, దంతెవాడ సరిహద్దు గంగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ కోసం ఓ ఉమ్మడి బృందం బయలుదేరింది. సమీపంలోని అటవీ ప్రాంతంలో నుంచి కాల్పుల మోత వినిపించగా.. భద్రతా దళాల ఎదురు కాల్పులతో ఆ పరిసర ప్రాంతం దద్దరిల్లింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో 26 మంది మావోయిస్టులు మరణించారు. కాంకేర్‌ జిల్లా అడవుల్లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతదేహాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. గంగలూరు నుంచి సుమారు 30 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన సైనికులు ఘటనా స్థలం నుంచి తిరిగి రావడానికి నానా అవస్థలు పడ్డారని ఐజి తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ప్రదేశం నుంచి ఎకె 47, ఎస్‌ఎల్‌ఆర్‌, ఐఎన్‌ఎస్‌ఎఎస్‌ 303, 315 బోర్‌, 12 బోర్‌, బర్మార్‌ మొదలైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను తీసుకొస్తున్న జవాన్లకు డిఐజి కమలోచన్‌ కస్యప్‌, బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ ఎదురెళ్లి అభినందనలు తెలిపారు. ఆండ్రి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డిఆర్‌జి బలగాలకు చెందిన జవాను మరణించినట్లు ఎస్‌పి చెప్పారు. ఎదురుకాల్పుల్లో డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్‌, మహిళా కమాండోలు పాల్గొన్నట్టు వివరించారు.

హిడ్మా కోసం గాలింపు

రాబోయే రోజుల్లో మావోయిస్టులపై పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు కేంద్రం తన బలగాలను రంగంలోకి దింపింది. మావోయిస్టు కమాండర్‌ హిడ్మా కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. హిడ్మాను వెతకడానికి 125కు పైగా గ్రామాల సాంకేతిక మ్యాపింగ్‌ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న దాదాపు 125 గ్రామాల థర్మల్‌ ఇమేజింగ్‌ను భద్రతా దళాలు సిద్ధం చేసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు వివిధ వ్యూహాల కింద పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా గత మూడు నెలల వ్యవధిలో భద్రతా దళాలు 77 మంది మావోయిస్టులను అంతమొందించాయి.

వచ్చే ఏడాది మార్చికి మావోయిస్టులు అంతం : అమిత్‌షా ప్రకటన

వచ్చే ఏడాది మార్చి 31 లోపు నక్సల్‌ ఉగ్రవాదం అంతమవుతుందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి ప్రకటించారు. ‘మావోయిస్టు రహిత భారతదేశం ప్రచారం’ దిశలో ఈ రోజు మన సైనికులు మరో పెద్ద విజయాన్ని సాధించారని ఆయన ఎక్స్‌లో రాసుకొచాఇ్చరు. మోడీ ప్రభుత్వం మావోయిస్టులపై క్రూరమైన వైఖరితో ముందుకు సాగుతోంది. లొంగిపోయిన వారికి అండగా నిలుస్తామని, లొంగని వారిని వదిలే ప్రసక్తేలేదంటూ కేంద్రం సంకేతాలిస్తోంది.

మావోయిస్టులను కట్టడి చేస్తే..

మావోయిస్టులను కట్టడి చేసినట్టయితే… కీలకమైన అటవీ సంపదను దోచుకోవచ్చని కేంద్రం ప్లాన్‌ చేస్తున్నదని పర్యావరణ వేత్తలు, గిరిజన సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పర్యావరణానికి విఘాతం కలిగేలా పలు చట్టాలకు తూట్లు పొడుస్తోంది. కార్పొరేట్లకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్న మోడీ సర్కార్‌ మావోయిస్టుల ఏరివేతను ముమ్మరం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

➡️