పార్లమెంట్ మార్చ్‌లో ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి వెంకట్
సిపిఎం ఎంపి శివదాసన్ సంఘీభావం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉపాధి హామీ పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఉద్యమించాలని అఖిల భారత వ్వవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని, రైతు కూలీల వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఉపాధి హామీ చట్టం సంఘర్షణ మోర్చా ఆధ్వర్యాన శుక్రవారం పార్లమెంట్ మార్చ్ జరిగింది. ఈ మార్చ్‌కు సిపిఎం ఎంపి వి శివదాసన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బి వెంకట్ మాట్లాడుతూ.. ఉపాధి వేతనాలు పెంచాలని అడిగితే కులం, మతం పేరుతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని, ప్రపంచానికి ఆహారం పెడతామని ప్రధాని మోడీ దేశాలు తిరుగుతున్నారని, కానీ ఈ దేశంలో పేదలు, ఉపాధి హమీ కూలీలకు వేతనాలు పెంచటం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో నిధుల కోత విధించడం దారుణమన్నారు. యుపిఎ ప్రభుత్వం ఉపాధి హమీ కూలీలకు నాలుగు శాతం నిధులు కేటాయిస్తే, బిజెపి ప్రభుత్వం కేవలం 1.37 శాతానికి తగ్గించి ఉపాధిహామీ కూలీల పొట్టకొడుతోందని విమర్శించారు. బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.6 లక్షల కోట్లు కేటాయిస్తే ప్రతి కూలీకి వంద పని దినాలు కల్పించవచ్చన్నారు. పని కల్పించకుండానే దేశవ్యాప్తంగా పది కోట్ల మంది కూలీల పేర్లను జాబ్ కార్డుల నుండి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 40 రోజుల పని దినాలను మాత్రమే కల్పించారని విమర్శించారు. ఎంపిల ఇళ్లను ముట్టడించి, సమస్యలను పార్లమెంట్‌లో మాట్లాడేటట్లు చేయాలని సూచించారు. ఉపాధి నిధులు, బడ్జెట్ గురించి అడిగితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కులం, మతం పేరుతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. పేదలందరూ ఒక్కటై ఈ పేదల వ్యతిరేక ప్రభుత్వంపై తిరగబడాలన్నారు. ఉపాధి హామీ వల్ల పేదలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని, ఈ పరిస్థితి కేంద్రానికి ఇష్టం లేదని విమర్శించారు. అందువల్లే నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, పేదలందరూ ఏకమై భూమి కోసం, ఉపాధి కోసం, అంటరానితనం నిర్మూలన కోసం అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ధర్నాలో దళిత బహుజన ఫ్రంట్ వ్వవస్థాపకులు కొరివి వినరు కుమార్, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్, వివిధ రాష్ట్రాల నాయకులు, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.