కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

  • ప్రధానమంత్రిగా మూడోసారి మోడీ ప్రమాణం 
  • 72 మందితో కేంద్ర కేబినెట్‌
  • ఎన్నికల్లో పోటీ చేయనివారికి కూడా చోటు 
  • టిడిపి నుంచి ఇద్దరికి కొలువులు

న్యూఢిల్లీ : కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ (73) వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. మోడీ ప్రమాణం చేసిన అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ తదితరులు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ దఫా కేబినెట్‌, సహాయ మంత్రులతో కలిపి మొత్తం 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం కొత్త కేబినెట్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రూఫ్‌ ఫొటో దిగారు. ఎన్‌డిఎలో బిజెపి తర్వాత అధిక స్థానాలు సాధించిన భాగస్వామ్యపక్షాలకు ఈ దఫా కేబినెట్‌లో బెర్తులు లభించాయి. తెలుగుదేశం పార్టీ (టిడిపి) నుంచి ఇద్దరు ఎంపీలు, అలాగే బిజెపి ఆంధ్రప్రదేశ్‌ కమిటీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు కేంద్ర కేబినెట్‌లో చోటుదక్కింది.. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలుండగా సార్వత్రిక ఎన్నికల్లో 21 చోట్ల ఎన్‌డిఎ విజయం సాధించిన సంగతి విదితమే. టిడిపి నుంచి రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, జెడిఎస్‌ నుంచి హెచ్‌డి కుమారస్వామి, బిజెపి నుంచి శర్వానంద సోనోవాల్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకున్నారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అతిథులుగా బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దాహల్‌ (ప్రచండ), మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజు తదితరులు హాజరయ్యారు. వీరేగాకుండా దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులు వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టిడిపి అధినేత చంద్రబాబు, జెడియు అధినేత నితీష్‌ కుమార్‌, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాన్‌, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ, ప్రముఖ సినీ నటులు షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌, స్వామి చినజీయర్‌ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మఠాధిపతులు హాజరయ్యారు. గత రెండు పర్యాయాల్లోనూ బిజెపి స్వతహాగా సాధారణ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దఫా బోటాబోటీగా కేవలం 240 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ సాధారణ మెజార్టీ అయిన 272కు ఆమడదూరంలో నిలిచిపోయింది. దీంతో ఈ దఫా టిడిపి, జెడియు వంటి కీలక భాగస్వామ్య పక్షాల మద్దతు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సివచ్చింది. గత రెండు పర్యాయాలు ఎన్‌డిఎ పక్షాలను సైతం పక్కనబెట్టి.. స్వీయబలగం చూసుకొని అత్యంత నిరంకుశ విధానాలను అమల్జేసిన మోడీ సర్కార్‌ ఈ దఫా భాగస్వామ్యపక్షాలతో కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడంతో మోడీ సరికొత్త రికార్డులు సృష్టించారు. తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ (1952, 1957, 1962) తర్వాత వరుసగా మూడు పర్యాయాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేతగా మోడీ రికార్డులకెక్కారు. నెహ్రూ తర్వాత ఏ ప్రధానీ వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు. గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మూడు పర్యాయాలు ప్రమాణం చేసినా..ఆయన వరుసగా చేయకపోవడంతో నెహ్రూతో సమాన రికార్డు మోడీ పరమైంది. అత్యధిక కాలంలో ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర నేతగా కూడా మోడీ రికార్డు సృష్టించారు. 1950 సెప్టెంబరు 17న గుజరాత్‌లో జన్మించిన మోడీ..చిన్ననాటి నుంచి సంఫ్‌ు పరివార్‌ రాజకీయాలతోనే ఉన్నారు. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ 2001లో తొలిసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో గోద్రా రైలు దగ్ధం ఘటన అనంతరం గుజరాత్‌లో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సంఫ్‌ు పరివార్‌ మారణకాండ సాగించినప్పుడు మోడీనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నరమేధాన్ని చూసిచూడనట్టు వదిలేయాల్సిందిగా మోడీయే ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన అభియో గాలను ఎదుర్కొన్నారు. తొలినాళ్లలో మోడీ నేతృత్వాన ‘గుజరాత్‌ అభివృద్ధి నమూనా’ గొప్పదంటూ కీర్తించిన ఉదారవాద ఆర్థిక వేత్తలు తదనంతరకాలంలో అదంతా డొల్ల అని తేల్చేశారు. కేంద్రంలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను, ప్రజా స్వామ్య వ్యవస్థలను ఒక్కొటొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వచ్చిన మోడీ సర్కార్‌ ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత ప్రజాగ్రహాన్ని చవిచూశారు. దీంతో బోటాబోటీ స్థానాలతో గట్టెక్కాల్సివచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఎ మొత్తంగా 286 స్థానాలు సాధించగా బిజెపి 240 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2019లో 282, 2014లో 303 స్థానాలను స్వతహాగా సాధించిన బిజెపి ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తంకావడంతో 240 సీట్లకే పరిమితమైంది.

➡️