బకెట్‌ను తాకుతావా?

  • దళిత బాలుడిపై ‘పెత్తందారు’ పైశాచికం
  • కులం పేరుతో దూషణ.. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఘటన

జైపూర్‌ : బిజెపి పాలిత రాజస్థాన్‌లో పెత్తందారీ కులానికి చెందిన ఒక వ్యక్తి.. ఎనిమిదేళ్ల దళిత బాలుడిపై రెచ్చిపోయాడు. నీటి బకెట్‌ను తాకాడని విచక్షణ కోల్పోయి మరీ ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అల్వార్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాలుడికి న్యాయం చేయాలనీ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. బాధిత బాలుడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. రోజులాగే స్కూల్‌కు వెళ్లాడు. దాహం వేసిన బాలుడు స్కూల్‌ పరిసరాల్లోనే ఉండే ఒక చేతిపంపు వద్దకు వెళ్లాడు. అక్కడ అప్పటికే పెత్తందారీ కులానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. చేతిపంపుతో తన బకెట్‌లో నీటిని నింపుతున్నాడు. అంటరానితనం అనే జాఢ్యం తెలియని ఆ బాలుడు.. దాహం తీర్చుకోవటానికి బకెట్‌ను కాస్త పక్కకు జరిపి, నీటిని తాగుదామనుకున్నాడు. అది చూసి కోపంతో ఊగిపోయిన నిందితుడు.. బాలుడు అని కూడా చూడలేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. కులం పేరుతో దూషించాడు. నిందితుడు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక బాలుడు ఏడుపు మొదలు పెట్టాడు. ఆ ఏడుపులు విని, అటువైపుగా వెళ్తున్న బాలుడి బంధువు ఇది గమనించాడు. ఘటన గురించి బాలుడి తండ్రికి తెలిపాడు. అనంతరం బాలుడి తండ్రి నిందితుడి ఇంటికి వెళ్లాడు. జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కులం పేరుతో బాలుడి కుటుంబాన్ని నిందితుడు దూషించాడు. ‘ఈ విషయంలో మీరు నన్ను ఏమీ చేయలేరు’ అని అహంకారాన్ని ప్రదర్శించాడు. ”ఈ ఘటనతో స్కూల్‌కు వెళ్లాలంటేనే నా కొడుకు భయపడుతున్నాడు. నిందితుడిపై పోలీసులకు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటున్నాడు. నిందితుడు మళ్లీ తనను కొడతాడనీ, స్కూల్‌కు మళ్లీ వెళ్లనని భయంలో ఉన్నాడు. నాకు న్యాయం కావాలి. నిందితుడికి శిక్ష పడాలి” అని బాలుడి తండ్రి తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసు అధికారి సవారు సింగ్‌ తెలిపారు. నిందితుడిని విచారించామనీ, ఆయనది తప్పని రుజువైతే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

➡️