- స్మైల్ పథకం కింద భూమి, ఇళ్ల పట్టాల పంపిణీ
- కేరళలో వామపక్ష ప్రభుత్వ నిర్ణయం
తిరువనంతపురం : కేరళలో గిరిజనుల బతుకుల్లో చిరునవ్వులు చిందించేలా అక్కడి వామపక్ష ప్రభుత్వం ఆదర్శనీయమైన పథకాన్ని చేపట్టింది. ‘ఆపరేషన్ స్మైల్’ పేరిట రూపొందించిన ఈ పథకం కింద స్థానిక ‘కొరగ’ తెగకు చెందిన గిరిజనులకు భూమి పంపిణీ చేయాలని నిర్ణయించింది. కాసర్‌గోడ్ జిల్లాలోని కాసర్‌గోడ్, మంజేశ్వరం తాలుకాల్లో ఉండే కొరగ గిరిజనులకు భూమి పట్టాలు అందజేయనున్నారు. తొలి విడతలో 16 గ్రామాల్లో 193.557 హెక్టార్ల భూమిని గుర్తించి పంపిణీ చేయనున్నారు. ఈ నెల 30న కాసర్‌గోడ్ కలెక్టరరేట్‌లో ‘ఆపరేషన్ స్మైల్’ను గిరిజన సంక్షేమ, అభివృద్ధి శాఖ మంత్రి ఒఆర్ కేలు, రెవెన్యూ శాఖ మంత్రి కె రాజన్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సరైనరీతిలో పత్రాల ధ్రువీకరణ, మరణించినవారికి సంబంధించిన టైటిల్ డీడ్స్‌ను వారి వారసులకు బదలాయించడం వంటి భూ సమస్యలను కూడా పరిష్కరించనున్నట్లు కాసర్‌గోడ్ జిల్లా కలెక్టర్ కె ఇంబాశేఖర్ తెలిపారు. మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 16 గ్రామాల్లోని 193.557 హెక్టార్ల భూమిని ఇందుకోసం గుర్తించినట్లు తెలిపారు. ఈ జిల్లాలో 539 కొరగ కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ఇన్నాళ్లూ పట్టాలు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం, సాగు తదితరవాటికి సమస్యలుండేవి..ఇప్పుడు పట్టాల పంపిణీతో ఆ చిక్కులన్నీ తొలగిపోనున్నాయని ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.