నిరసన గళాలపై ఉక్కుపాదం !

Jun 9,2024 09:08 #voices of protest
  • దేశ వ్యతిరేకులంటూ ముద్ర
  • నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
  • ప్రభుత్వ విధానాలను విమర్శించిన టీచర్‌పైనా వేటు

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల అనంతరం అణచివేత చర్యలు మొదలయ్యాయి. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తూ విధుల నుండి తొలగించారు. పైగా వారికి తీవ్రవాద కార్యకాలాపాలతో సంబంధం వుందని ఆరోపిస్తూ అందుకే ఈ చర్యలు తీసుకున్నామని జమ్మూ కాశ్మీర్‌ పాలనా యంత్రాంగం పేర్కొంది. రోడ్ల పరిస్థితి అస్సలు బాలేదంటూ ప్రభుత్వాన్ని ఆన్‌లైన్‌లో తీవ్రంగా విమర్శించినందుకు ఆ వీడియో పోస్టు చేసిన టీచర్‌ను కూడా సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తొలగించిన వారిలో ఇద్దరు పోలీసు సిబ్బంది, జలశక్తి శాఖకు చెందిన ఉద్యోగి, టీచర్‌ వున్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు రాజ్యాంగంలోని 311 అధికరణ కింద ఈ ఉద్యోగులను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి విచారణ జరపకుండానే భద్రతా సంస్థలు ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకుని ఈ తొలగింపు ఉత్తర్వులు జారీ చేశారు. తొలగించిన వారిలో పుల్వామాలోని లార్మూV్‌ాలో పోలీసు విభాగానికి చెందిన సెలక్షన్‌ గ్రేడ్‌ కానిస్టేబుల్‌ అబ్దుల్‌ రహమాన్‌ దార్‌, లాల్‌గమ్‌కి చెందిన మరో కానిస్టేబుల్‌ గులాం రసూల్‌ భట్‌, కుల్గామ్‌లోని బంగమ్‌కి చెందిన టీచర్‌ షబీర్‌ అహ్మద్‌ వనీ, బారాముల్లాకి చెందిన జల శక్తి విభాగంలో అసిస్టెంట్‌ లైన్‌మేన్‌ అనయతుల్లా షా వున్నారు. వీరందరికీ తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, తీవ్రవాద దాడులకు పాల్పడేందుకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నారంటూ ప్రభుత్వం వారిపై ఆరోపణలు చేసింది. దోడా జిల్లాలోని చెనాబ్‌ లోయ ప్రాంతానికి చెందిన టీచర్‌ ఫియాజ్‌ అహ్మద్‌ రోడ్ల దుస్థితిని తెలియచేస్తూ ఒక వీడియో చేశారు. డ్రామన్‌ గవర్నమెంట్‌ మిడిల్‌ స్కూల్లో వసతులు సరిగా లేవని విమర్శించారు. ఆ వీడియో బాగా వైరల్‌ అయింది. దానిపై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారంటూ ఆ టీచర్‌ను సస్పెండ్‌ చేశారు. పైగా దానిపై ఆ టీచర్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం విచారణకు అవకాశం లేకుండా ఇలా ఏకపక్షంగా తొలగించడం సహజ న్యాయసూత్రాలకే విరుద్ధమని పలువురు విమర్శిస్తున్నారు.

➡️