- స్వగ్రామంలో పుష్పన్‌కు అంత్యక్రియలు
తలస్సేరి : ఉద్యమంలో తుపాకీ తూటాలు తగలడంతో మూడు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైనా పోరాట పథాన్ని వీడని పుష్పన్ (54)కు వేలాదిమంది కన్నీటి వీడ్కోలు పలికారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన కేరళలోని కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. పుష్పన్ భౌతికకాయానికి ఆదివారం సాయంత్రం స్వగ్రామం చోక్లి మేనప్రారంలో అంత్యక్రియలు నిర్వహించారు. 1994 నవంబర్ 25న యుడిఎఫ్ ప్రభుత్వ అవినీతి, విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా కూతుపరంబలో అప్పటి మంత్రి ఎంవి రాఘవన్‌కు నల్లజెండా చూపి, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన పోరాడారు. పోలీసు కాల్పుల్లో కెకె రాజీవన్, కెవి రోషన్, శిబులాల్, బాబు, మధు ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్ తగలడంలో 24 ఏళ్ల పుష్పన్ వెన్నుపాము దెబ్బతింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూనే సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై స్పందించేవారు. కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని శనివారం సాయంత్రం డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ కార్యాలయం యూత్ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఆదివారం కోజికోడ్ నుంచి కన్నూరుకు, ఆ తరువాత ఆయన స్వగ్రామం చౌక్లీకి తరలించారు. దారిపొడవునా వేలాదిమంది సిపిఎం, వామపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, ఘనంగా నివాళులర్పించారు.