భోపాల్ : కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సత్నా జిల్లా ఉంచెరా వెళ్లేందుకు కట్ని రైల్వే స్టేషన్‌లో 30 ఏళ్ల మహిళ ఒక ప్యాసింజర్ రైలు ఎక్కింది. ఆ రైలు పట్కారియా స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో వాష్‌రూమ్ అవసరాల కోసం ఆమె అదే స్టేషన్‌లో వేరొక ఫ్లాట్‌ఫామ్‌పై ఆగివున్న ఒక స్పెషల్ ట్రైయిన్‌లోని ఎసి కంపార్ట్‌మెంట్‌లో ప్రవేశించింది. ఆమెను వెంబడిస్తూ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కమలేష్ కుష్వాహ ఆ కంపార్ట్‌మెంట్ డోర్ లాక్ చేశాడు. ఆ కంపార్ట్‌మెంట్ అంతా ఖాళీగా ఉంది. ఆ రైలు కదలడం ప్రారంభించగానే మహిళను కొట్టి, చిత్రహింసలకు గురిచేశాడు. చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ రైలు సత్నా స్టేషన్‌కు చేరుకోగానే బాధిత మహిళ కిందకు దిగి ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌కు తనపై జరిగిన అత్యాచార విషయాన్ని తెలిపింది. సిబ్బంది కోచ్ వద్దకు వచ్చేసరికి రైలు బయలుదేరిపోయింది. ఆర్‌పిఎఫ్ సిబ్బంది రావడం చూసిన కమలేష్ కోచ్ తలుపులకు తాళం వేసి అందులో దాకున్నాడు. స్టేషన్ మాస్టర్ తరువాతి స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆర్‌పిఎఫ్ సిబ్బంది కూడా రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. రైలు రేవా స్టేషన్‌కు చేరుకున్న తరువాత అక్కడి మెకానిక్ బృందం సహాయంతో తలుపుల్ని తెరిచారు. మూడు గంటలపాటు దాక్కున్న కమలేష్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.
