తీహార్ (న్యూఢిల్లీ) : ఢిల్లీలోని తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. ఓ ఖైదీ పదునైన ఆయుధంతో తోటివారిపై దాడి చేశాడని, ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు జైలు అధికారులు శనివారం వెల్లడించారు. కాగా, ఖైదీల ఘర్షణ నేపథ్యంలో …. అదే జైలులో ఉన్న తమ నేతల భద్రతపై ఆమ్ ఆద్మీ పార్టీ, బిఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
ఏం జరిగిందంటే ?
గత శుక్రవారం తీహార్ జైలులోని సెల్ నంబర్ 8, 9 లో ఉన్న లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీల మధ్య జైలులోని ఫోన్ రూమ్‌లో గొడవయ్యింది. లోకేష్ అనే వ్యక్తి సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ లు జైలులో ఉన్నారు. లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్‌లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక ఖైదీని హాస్పిటల్ నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా … లిక్కర్ కుంభకోణంలో జరిగిన మనీలాండరింగ్ కేసు ఆరోపణలపై అరెస్టయ్యి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. తాజాగా ఖైదీల ఘర్షణ నేపథ్యంలో … ఆమ్ ఆద్మీ పార్టీ, బిఆర్‌ఎస్ వర్గాల్లో కలవరం మొదలయ్యింది. జైలులో ఉన్న తమ నేతల భద్రతపై పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.