ఢిల్లీ మద్యం కేసులో సహనిందితురాలిగా ఆప్‌

May 15,2024 00:09 #AAP, #Delhi L liquor Policy Case
  •  హైకోర్టుకు తెలిపిన ఇడి

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో తదుపరి దాఖలు చేయబోయే ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదు (ఛార్జిషీట్‌)లో ఆప్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ను సహ నిందితురాలిగా చేరుస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మంగళవారం ఢిల్లీహైకోర్టుకు తెలిపింది. మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్‌ విచారణ సందర్భంలో ఇడి ఈ విషయాన్ని వెల్లడించింది. సిసోడియాకు బెయిల్‌ మంజారు చేయవద్దని కోరింది. ఈ కేసులో అభియోగాలు నమోదు చేయకుండా ఆలస్యం చేసేందుకు నిందితులు శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఇడి తెలిపింది. జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ముందు ఇడి తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. సిసోడియా తరుపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ సిసోడియాకు బెయిల్‌ మంజారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇడి, సిబిఐలు వరసగా వ్యక్తులను అరెస్టు మాత్రమే చేస్తున్నాయని, విచారణను త్వరగా ముగించే ప్రశ్నే లేదని తన వాదన వినిపించారు. ఈ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు సిసోడియా బెయిల్‌ పిటీషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ కేసులో గత ఏడాది ఫిబ్రవరిలో సోసిడియాను ఇడి అరెస్టు చేయగా, తరువాత నెలలో సిబిఐ ఆరెస్టు చేసింది. తన బెయిల్‌ పిటీషన్‌ను ఏప్రిల్‌ 30న రోస్‌ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును సిసోడియా ఆశ్రయించారు.

➡️