కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన ఆప్‌ ప్రభుత్వం

Feb 13,2024 11:55 #AAP Government, #delhi-chalo-march

 న్యూఢిల్లీ   :    రైతులను నిర్బంధించేందుకు ఢిల్లీలోని స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనను ఆప్‌ ప్రభుత్వం తిరస్కరించింది. బవానాలోని రాజీవ్‌గాంధీ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చాలని కేంద్రం ఆప్‌ ప్రభుత్వాన్ని కోరింది. రైతుల డిమాండ్లు వాస్తవమైనవని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతిపౌరునికి రాజ్యాంగం కల్పించిందని తెలిపింది. రైతులను అరెస్ట్‌ చేయడం సరికాదని ఢిల్లీ హోంమంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ కేంద్ర ప్రభుత్వానికి సమాధానమిచ్చారు. వాస్తవానికి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వారిని చర్చలకు ఆహ్వానించాలని గెహ్లాట్‌ పేర్కొన్నారు. దేశానికి అన్నదాతలైన రైతులను అరెస్ట్‌ చేయడమేమిటని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయంలో తాము భాగస్వామ్యులం కాలేమని అన్నారు.

పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పెన్షన్‌, బీమా ప్రయోజనాలతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంతో రైతు సంఘాల నేతలు జరిపిన పలు రౌండ్ల చర్చలు విఫలమయ్యాయి.

➡️