న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సిఎం బంగ్లా వద్ద హైడ్రామా నెలకొన్నది. గతంలో అరవింద్ కేజ్రీవాల్ సిఎంగా ఉన్నప్పుడు షీష్ మహల్ ఆధునీకరణంలో భాగంగా టాయిలెట్‌లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బిజెపి నేతలు గత కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. బిజెపి నేతల విమర్శలను ఆప్ ఖండించింది. అయినప్పటికీ బిజెపినేతలు తీవ్రంగా విమర్శిస్తుండడంతో.. వారి ఆరోపణలు అబద్ధమని నిరూపించేందుకు ఆప్ నేతలు ప్రయత్నించారు. బుధవారం రాజ్యసభ ఎంపీ సంజరు సింగ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో కలిసి ఆ బంగ్లా వద్దకు వెళ్లారు. 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని ఢిల్లీ సిఎం బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆప్ నేతలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు.
కాగా, ఈ సందర్భంగా ఆప్ నేతలు సంజరు సింగ్, సౌరభ్ భరద్వాజ్ బీజేపీపై మండిపడ్డారు. ఆ పార్టీ చెప్పే అబద్ధాలు బయటపడ్డాయని అన్నారు. ‘సీఎం నివాసంలో బంగారు మరుగుదొడ్డి, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ ఉన్నాయంటూ బీజేపీ నేతలు కొన్ని నెలలుగా గోల చేస్తున్నారు. ఇవాళ మీడియాతో పాటు ఇక్కడకు వచ్చాం. బీజేపీ నేతలు కూడా రావాలని కోరాం. వారు చెప్పిన బంగారు మరుగుదొడ్లు, స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉన్నాయో చూడాలనుకున్నాం. అయితే పోలీసులు, వాటర్ ఫిరంగులను మోహరించారు. లోనికి అనుమతిస్తే అసలు నిజం బయటపడేది’ అని అన్నారు.
మరోవైపు ప్రధాని మోడీ అధికార నివాసం ‘రాజ్ మహల్’ అని ఆప్ నేతలు విమర్శించారు. దీని కోసం రూ.2,700 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. దమ్ముంటే ప్రజా ధనంతో నిర్మించిన ప్రధాని లగ్జరీ హౌస్‌లోకి మీడియాను అనుమతించాలని బీజేపీకి సవాల్ చేశారు. ఆప్ నేతలు సంజరు సింగ్, సౌరభ్ భరద్వాజ్ ఆ తర్వాత ప్రధాని నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.