హిండెన్‌బర్గ్‌ రద్దు అంటే మోదానీకి ‘క్లీన్‌చిట్‌’ ఇచ్చినట్లు కాదు : కాంగ్రెస్‌

న్యూఢిల్లీ :   హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థను రద్దుచేయడమంటే మోదానీలకు ‘క్లీన్‌ చిట్‌’ ఇచ్చినట్లు కాదని కాంగ్రెస్‌ గురువారం పేర్కొంది. 2023 జనవరిలో వెల్లడైన హిండెన్‌బర్గ్‌ నివేదిక అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలపై విచారణకు నిపుణుల కమిటీని నియమించేలా సుప్రీంకోర్టును ఒత్తిడి చేసేంత తీవ్రమైనవిగా నిర్థారణైందని కాంగ్రెస్‌ పేర్కొంది. అదానీ ప్రధాన రక్షకుడు మరోవరో కాదు దేశ ప్రస్తుత ప్రధాని అని కాంగ్రెస్‌  ఓ  ప్రకటనలో పేర్కొంది.

హిండెన్‌బర్గ్‌ నివేదిక మోదానీ స్కామ్‌లోని సెక్యూరిటీస్‌ చట్టాల ఉల్లంఘనల్లో ఒక భాగాన్ని మాత్రమే వెల్లడించిందని పేర్కొంది. 2023 జనవరి -మార్చిలో హమ్‌ అదానీ కె హై కౌన్‌ (హెచ్‌ఎహెచ్‌కె) సిరీస్‌లో అదానీ మెగాస్కామ్‌పై కాంగ్రెస్‌ ప్రధాని మోడీకి సంధించిన 100 ప్రశ్నల్లో హిండెన్‌ బర్గ్‌ నివేదిక కేవలం 21 ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించిందని పేర్కొంది.

జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రధాని మోడీ తన సన్నిహితులను సంపన్నులుగా చేసేందుకు భారత విదేశాంగ విధానాన్ని దుర్వినియోగం చేయడం ఈ నివేదికలో ఉందని కాంగ్రెస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. కీలకమైన మౌలిక సదుపాయాల ఆస్తులను ఉపసంహరించుకునేలా భారతీయ వ్యాపారవేత్తలను ఒత్తిడి చేయడం, విమానాశ్రయాలు, ఓడరేవులు, రక్షణ, సిమెంట్‌ రంగాల్లో గుత్తాధిపత్యాన్ని అదానీకి అప్పగించడంలో సహాయం చేసేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశారు. సెబీ వంటి గౌరవప్రదమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంతో పాటు  అదానీ ఆస్తులు, ఆర్థిక సంబంధాల వైరుధ్యాలకు స్పష్టమైన సాక్ష్యం  ఈ నివేదికలో వెల్లడైందని ప్రకటన పేర్కొంది.

దర్యాప్తు సంస్థకు సుప్రీంకోర్టు కేవలం రెండు నెలల సమయం ఇచ్చినప్పటికీ విచారణను రెండేళ్లపాటు కొనసాగించేలా చేయడం గమనించదగిన అంశం. మోదానీ దేశంలో సంస్థలను స్వాధీనం చేసుకుని ఉండవచ్చు కానీ దేశం వెలుపల బహిర్గతమైన నేరాలను ఈ విధంగా కప్పిపుచ్చలేమని పేర్కొంది. ఆ ప్రకటనలో అదానీ గ్రూప్‌పై అమెరికా ఆరోపణలను ప్రధానంగా ప్రస్తావించింది.

లాభదాయకమైన సౌరవిద్యుత్‌ కాంట్రాక్టులను పొందేందుకు అదానీ భారతీయ అధికారులకు లంచం ఇచ్చారని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఆరోపించింది. మనీలాండరింగ్‌, అపహరణతో పాటు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న చాంగ్‌ చుంగ్‌-లింగ్‌, నాసర్‌ అలీ షబాన్‌ అహ్లీలు నిర్వహిస్తున్న అదానీతో లింకప్‌ అయిన బ్యాంకు ఖాతాలను స్విస్‌ ఫెడరల్‌ క్రిమినల్‌ కోర్టు ఆదేశాల మేరకు స్విస్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ కార్యాలయం స్తంభింపజేసింది. నేరం రుజువు కావడంతో చాలా దేశాలు అదానీతో ప్రాజెక్టులను రద్దు చేసుకున్నాయని ఆ ప్ర కటన పేర్కొంది.

”ఇండోనేషియా నుండి అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గుపై అధిక ఇన్వాయిస్‌ నమోదైనట్లు స్పష్టమైన ఆధారాలు వెలువడ్డాయి. షిప్పింగ్‌, గుజరాత్‌లోని ముంద్రాకు చేరుకునేలోపు  బొగ్గు ధర  52 శాతం పెరిగింది. అదానీ లింక్డ్‌ ట్రేడింగ్‌ సంస్థల ద్వారా 2021-23 మధ్య భారత్‌ నుండి 2,12,000 కోట్లు తరలించినట్లు దర్యాప్తులో తేలింది” అని ఆ ప్రకటన పేర్కొంది.  వీటితో పాటు ఇతర వెల్లడికాని నిధుల మొత్తం 2,20,000 కోట్లు.

షెల్‌ కంపెనీల నెట్‌వర్క్‌ను వినియోగించి అదానీ గ్రూప్‌ కంపెనీలలో బినామీ వాటాలను సృష్టించేందుకు చాంగ్‌ మరియు అహ్లీలను వినియోగించారు. అధిక ఇన్‌వాయిస్‌ సమయంలో గుజరాత్‌లో అదానీ పవర్‌ నుండి కొనుగోలు చేసిన విద్యుత్‌ధరలు 102 శాతం పెరిగాయని కాంగ్రెస్‌ పేర్కొంది.
ఈ ఆరోపణలన్నీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) మాత్రమే దర్యాప్తు చేయగల పక్షపాత, నేరపూరిత చర్యలు. అయితే జెపిసి విచారణ లేకుండా, ఇప్పటికే రాజీపడిన భారత దేశ సంస్థలు ప్రధాని, అతని స్నేహితులను రక్షించేందుకు శక్తివంతంగా కృషి చేస్తున్నాయి. ఇదే సమయంలో దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు క్షీణిస్తున్న ఆర్థిక వాతావరణంలో తమను తాము రక్షించుకోవడంలో మిగిలిపోతున్నారని  కాంగ్రెస్‌ దుయ్యబట్టింది.

➡️