- నలుగురు కార్మికుల దుర్మరణం
రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లాలో గురువారం ఉక్కు కర్మాగారంలోని చిమ్నీ కుప్పకూడంతో నలుగురు కార్మికులు చనిపోయారు. శిథిలాల కింద మరో నలుగురు చిక్కుకుపోయారని భావిస్తున్నారు. చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంగేలిలోని సరాగావ్ ప్రాంతంలో ఉన్న కుసుమ్ స్టీల్ ప్లాంట్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు సమయంలో చిమ్నీ ఒక్కసారిగా కూలిపోయింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. గాయపడిన ఇద్దరు కార్మికులను రక్షించి ఫ్యాక్టరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాస్‌పూర్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం స్పాంజ్ ఐరన్‌ను ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టర్టీలో సుమారు 350 మంది కార్మికులు వేర్వేరు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. అయితే ప్రమాదం మధ్యాహ్న సమయంలో జరగడంతో ఘటనస్థలంలో ఎక్కువ మంది కార్మికులు లేరని యాజమాన్యం తెలిపింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, సంఘటనా స్థలంలోనే జిల్లా కలెక్టర్, ఎస్‌పి ఉన్నారని తెలిపారు.