ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసు నుంచి తనను తప్పించాలని జెరూసలేం మత్తయ్య గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జెరూసలేం మత్తయ్య పేరును తొలగిస్తూ (క్వాష్) ఇదివరకే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2016 జులై 6న తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఎసిబి) సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్, ప్రతివాది తరపున ఒఆర్ ప్రియాంక ప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాత చేపడతామని ధర్మాసనం పేర్కొంది. కాగా… వచ్చే ఏడాది జనవరి 7న ఈ పిటిషన్ మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చే అవకాశం ఉంది.