- 26న జిల్లాలు, సబ్ డివిజన్లలో ట్రాక్టర్స్, మోటార్ సైకిల్ మార్చ్‌లు
- రాష్ట్రాల్లో కిసాన్ మహాపంచాయత్‌లు
- సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈ నెల 20న ఎంపిల ఇళ్లు, కార్యాలయాల వద్ద ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. ఈ నెల 26న జిల్లాలు, సబ్ డివిజన్లలో జరిగే ట్రాక్టర్, వాహనం, మోటార్ సైకిల్ మార్చ్‌లు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు గురువారం ఎస్‌కెఎం ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన ముసాయిదా (ఎన్‌పిఎఫ్‌ఎఎం)ను తిరస్కరిస్తూ రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానాన్ని ఆమోదించాలని, రైతు సంఘాల చర్చలు జరపడానికి, దల్లేవాల్ ప్రాణాలను కాపాడటానికి ప్రధానమంత్రికి లేఖ రాయాలని ముఖ్యమంత్రులను ఎస్‌కెఎం నేతలు కోరుతున్నారు. ఖానౌరి సరిహద్దులో జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నిరవధిక నిరాహార దీక్ష 52 రోజులు దాటిన నేపథ్యంలో ఎంఎస్‌పి, రుణమాఫీ, జగ్జిత్ సింగ్ దల్లెవాల్ ప్రాణాలను కాపాడటం, వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన ముసాయిదాను వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎస్‌కెఎం పోరాడుతోందని పేర్కొన్నారు. 52 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న దల్లేవాల్ ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఉందని ప్రధానమంత్రికి లేఖ రాయాలని ఎస్‌కెఎం సమన్వయ కమిటీ నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించాలని, ఫిబ్రవరి 11న బీహార్‌లోని పాట్నాలో భారీ కిసాన్ మహాపంచాయత్ జరగనుందని తెలిపింది. రైతు వ్యతిరేక, సమాఖ్య వ్యతిరేక వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన ముసాయిదా (ఎన్‌పిఎఫ్‌ఎఎం) తిరస్కరించడానికి అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించాలని, దానిని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఎస్‌కెఎం ప్రతినిధులు సంబంధిత ముఖ్యమంత్రులను కలవనున్నారు. రైతు సంఘాలతో వెంటనే చర్చలు నిర్వహించి దల్లేవాల్ ప్రాణాలను కాపాడాలని ప్రధానమంత్రికి లేఖ రాయాలని కోరనున్నారు.
ఈ నెల 20న ఎంపిల నివాసం, కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి, ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని వారిని కోరనుంది. రైతు ర్యాలీలు, టార్చ్‌లైట్ ఊరేగింపులతోపాటు గ్రామాల్లో వారం రోజుల ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ఎస్‌కెఎం రైతులకు పిలుపునిచ్చింది. రైతుల డిమాండ్లకు మద్దతుగా కార్మికులు ఈ నెల 26న జరిగే ట్రాక్టర్, వాహనం, మోటార్ సైకిల్ కవాతులో కూడా పాల్గొనాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి.