పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి ప్రభుత్వ హయంలో వ్యవసాయం, విద్యా, రైల్వే రంగాలు కుదేలయ్యాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. గురువారం లోక్‌సభలో విద్యా, రైల్వే రంగాల బడ్జెట్‌పై చర్చ జరగగా, రాజ్యసభలో వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో సిపిఎం ఎంపి బికాష్ రంజన్ భట్టాచార్య మాట్లాడుతూ హరిత విప్లవ పితామహులు ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం అదే స్వామినాథన్ ప్రతిపాదనలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇదేనా ఆ మహానీయునికి ఇచ్చే గౌరవమని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాని మోడీ చేసిన కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రైతులు ఎలా తిప్పికొట్టారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. రైతుల సమస్యలను, వ్యవసాయ సంక్షోభాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, వీటిని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్పొరేట్లకు రుణమాఫీ చేసే ప్రభుత్వం, రైతులకు ఎందుకు రుణమాఫీ చేయటం లేదని ప్రశిుంచారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, కానీ మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఎంతసేపు పిఎం కిసాన్ గురించి మాట్లాడుతున్నారని, అయితే రెండున్నరేళ్లలో 1.54 కోట్ల మంది రైతులను పిఎం కిసాన్ నుండి తొలగించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ప్రభుత్వం పంటను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.
విద్యా స్వేచ్ఛలో బలహీనత
బిజెపి ప్రభుత్వ హయంలో విద్యా స్వేచ్ఛ బలహీనపడిందని కాంగ్రెస్ ఎంపి ఆంటో ఆంటోని విమర్శించారు. లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విద్యార్థులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదన్నారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల్లో తీవ్రస్థాయిలో భావప్రకటనా స్వేచ్ఛను అణిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన రైల్వే మంత్రి కాదు…రీల్ మంత్రి
దేశవ్యాప్తంగా అనేక చోట్ల పదేపదే రైలు ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వాటికి బాధ్యత వహించడం లేదని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగొయ్ విమర్శించారు. పైగా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతేడాది బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రైల్వే మంత్రి మాత్రం తనకేమీ పట్టనట్టు రీల్స్ చేయడంలో మునిగిపోయారని విమర్శించారు. ఆయన రైల్వే మంత్రి కాదని రీల్ మినిస్టర్, డిరైల్‌మెంట్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోకపోవడం బిజెపికి సంప్రదాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రమాదాలపై అశ్వినివైష్ణవ్ ప్రకటన సంతృప్తికరంగా లేదని ఇండియా ఫోరం సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు గొగొయ్ తెలిపారు. కాగా సభ్యులకు సమాధానమివ్వాల్సిన రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆ పనిచేయకుండా ప్రత్యారోపణలకు దిగారు. 58 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక కిలోమీటర్ ట్రాక్‌కు కూడా వారు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఎటిపి) నెలకొల్పలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన ట్రోల్ ఆర్మీతో తప్పుడు విషయాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు గుండెల్లో గుబులు పుట్టించేలా భయపెట్టడమే కాంగ్రెస్ ఉద్దేశమా అని ప్రశిుంచారు. రైళ్లలో మూడింట రెండు వంతుల నాన్ ఎసి కోచ్‌లు, మూడోవంతు ఎసి కోచ్‌లు ఉంటాయని, జనరల్ కోచ్‌లకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ప్రతి మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో కనీసం నాలుగు జనరల్ కోచ్‌లు ఉండేలా చూస్తామని చెప్పారు. ఇందుకోసం 2,500 జనరల్ కోచ్‌లు త్వరలో సిద్ధమవుతాయని మంత్రి తెలిపారు.