AIADMK: తమిళనాడులో మళ్లీ అన్నాడిఎంకోబిజెపి పొత్తు

Apr 11,2025 22:59 #AIADMK, #BJP alliance, #Tamil Nadu

చెన్నై: తమిళనాడులో అన్నాడిఎంకోబిజెపి మధ్య మరోసారి పొత్తు కుదిరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల పొత్తుపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం ఒక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకెతో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. తమిళనాడు పర్యటనలో ఉన్న అమిత్‌ షా, అన్నాడిఎకెం అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామితో కలిసి చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పళనిస్వామి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు జట్టుకట్టిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో బిజెపి నాలుగు స్థానాలు గెలుచుకుంది. అయితే, 2023 సెప్టెంబర్‌లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ నుంచి అన్నాడిఎంకె వైదొలగింది. బిజెపితో సంబంధాలను అన్నాడిఎంకె తెంచుకుంది. తాజాగా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలూ కలిసిపోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. అవసరమైతే.. కనీస ఉమ్మడి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని అమిత్‌ షా తెలిపారు. ఈ పొత్తు కోసం అన్నాడిఎంకె ఎలాంటి షరతులు, డిమాండ్లు పెట్టలేదని అమిత్‌ షా తెలిపారు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తమ పార్టీ జోక్యం చేసుకోబోదన్నారు. సీట్ల కేటాయింపు, తదితర అంశాలను తర్వాత నిర్ణయిస్తామన్నారు.

తమిళనాడు బిజెపి కొత్త అధ్యక్షుడిగా నాగేంద్రన్‌
తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా నైనార్‌ నాగేంద్రన్‌ ఎన్నికయ్యారు. ఈ అధ్యక్ష పదవికి తిరునల్వేలి ఎమ్మెల్యే నాగేంద్రన్‌ ఒక్కరే నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. టి.నగర్‌లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలుచేయడంతో నాగేంద్రన్‌ ఎన్నిక ఖాయమయింది. నాగేంద్రన్‌ అన్నాడిఎంకె నుంచి బిజెపిలోకి వచ్చారు. ప్రస్తుతం అన్నాడిఎంకెతోనే బిజెపి పొత్తుపెట్టుకోంది. జయలలిత మంత్రివర్గంలో 2001-2206లో నాగేంద్రన్‌ మంత్రిగానూ పనిచేశారు.

➡️