న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎఐసిసి సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంస్థాగత వ్యవహారాలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సంసిద్ధతపై చర్చించినట్లు తెలుస్తోంది. వీటితోపాటుగా వివిధ జాతీయ అంశాలపై కూడా చర్చించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఎన్నికల సన్నద్దత కోసం సంస్థాగత విషయాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై చర్చించడానికి మేము ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేశాము. సెబీ సంస్థకి, అదానీ గ్రూప్ సంస్థల మధ్య ఉన్న అక్రమ ఆర్థిక సంబంధం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరం. ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపితే స్టాక్ మార్కెట్లో చిన్న పెట్టుబడిదారుల డబ్బు ప్రమాదంలో పడదు. సెబీ ఛైర్‌పర్సన్ తన పదవికి రాజీనామా చేయాలి. దీనికి సంబంధించి జెపిసిని ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
‘నిరుద్యోగం, నియంత్రణలేని ద్రవ్యోల్బణం, గృహ పొదుపు క్షీణత వంటి ముఖ్యమైన సమస్యలపైన మేము దృష్టి సారించాము. మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను ద్రోహం చేసింది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడిని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనేది ప్రజల డిమాండ్.’ అని ఖర్గే తన పోస్టులో పేర్కొన్నారు.
ఎంఎస్‌పికి చట్టపరమైన హామీ, అగ్నిపథ్ పథకం రద్దు కోసం కాంగ్రెస్ పోరాడుతుంది. ఇటీవల కాలంలో రైల్లు పట్టాలు తప్పడం ఆనవాయితీగా మారింది. దీంతో కోట్లాది మంది ప్రయాణీకులు ఇబ్బందిపడుతున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ప్రకృతి విపత్తుల సమస్యలపై కాంగ్రెస్ జాతీయ కార్యాచరణ రూపొందించి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుందని ఖర్గే చెప్పారు.
సమావేశం అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘కులగణన చేపట్టాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే మేము డిమాండ్ చేశాం. ఉత్తరాఖండ్, హిమాచల్, ఈశాన్య రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల గురించి మేము ఏఐసిసి సమావేశంలో చర్చించాము. బంగ్లాదేశ్‌కు సమస్యకు సంబంధించి, మతపరమైన మైనార్టీలు వారి ప్రార్థనా స్థలాలపై దాడులను అరికట్టడానికి, వారు భద్రత కల్పించాలని, గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు వీలుకల్పించేలా అన్ని చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి ఈ సమావేశం పిలుపునిచ్చింది.
