కాలుష్య నియంత్రణ ‘గాలి’కి

  • ఎన్‌క్యాప్‌ నిధుల వినియోగంలో అలసత్వం
  • పర్యావరణవేత్తలు,నిపుణుల ఆందోళన

న్యూఢిల్లీ : భారత్‌లో గాలి కాలుష్యం తీవ్రమవుతున్నది. ముఖ్యంగా, ఉత్తర భారతదేశంలో చలికాలంలో గాలి నాణ్యత సూచీ (ఎక్యూఐ) ఆందోళనకరంగా ఉంటుంది. ఢిల్లీ, నోయిడాతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సిఆర్‌) నగరాలు, పట్టణాలు, ప్రాంతాల్లో ఈ పరిస్థితులు కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలకు శ్వాస తీసుకోవటమూ ఇబ్బందిగానే ఉంటుంది. గాలి కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సిఎపి) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దేశంలోని 131 నగరాలకు లక్ష్యాలను నిర్దేశించింది. 40 శాతం గాలి కాలుష్య తగ్గుదలను 2025-26 నాటికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టింది.

ఎన్‌క్యాప్‌ కింద 82 నగరాలు నేరుగా నిధులను పొందుతాయి. మిగిలిన 42 నగరాలు, పట్టణాలు మాత్రం 15వ ఆర్థిక సంఘం కింద నిధులను అందుకుంటాయి. 2019 నుంచి గతేడాది మే వరకు 131 నగరాలకు పైన తెలిపిన రెండు మార్గాల ద్వారా మొత్తం రూ.10,566 కోట్ల నిధులు అందాయి. ఇందులో 82 నగరాలకు గత ఐదేండ్లలో ఎన్‌క్యాప్‌ కింద 1615.47 కోట్ల నిధులు అందగా.. ఖర్చు చేసింది 1092 కోట్లు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ నగరాల్లో మాత్రం గాలి కాలుష్యం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నది. ఇక్కడ ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం నమోదవుతున్నది. గతనెలలో గాలి నాణ్యతా సూచీ (ఎక్యుఐ) 481గా నమోదై నిర్ఘాంతపర్చింది. ఇక్కడ గాలి కాలుష్యం దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నా.. నిధుల వినియోగం మాత్రం 40 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 131 నగరాలలో 55 మాత్రమే గాలిలో పిఎం10 సాంద్రతను 20 శాతం తగ్గించాయి. ఢిల్లీ కేవలం 14 శాతం తగ్గించటం గమనార్హం.

విశాఖలో 14 శాతమే వినియోగం

ఎన్‌క్యాప్‌ అమలుపై కమిటీ ఆన్‌లైన్‌లో ఒక సమావేశాన్ని నిర్వహించింది. దీని ప్రకారం.. 68 నగరాలు మాత్రం వాటికి కేటాయించిన నిధుల్లో 75 శాతాన్ని కూడా వినియోగించలేదు. ఉదాహరణకు, నోయిడాకు రూ.30.89 కోట్లను కేటాయిస్తే.. 11 శాతం నిధులే ఖర్చు చేయటం గమనార్హం. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ పట్టణం 14 శాతం, అనంతపురం 20 శాతం మేర ఖర్చు చేశాయి. మెట్రో నగరాల్లో.. బెంగళూరు అతి తక్కువగా 30 శాతం నిధులను వెచ్చించగా.. ఢిల్లీ (32 శాతం), పూణే (46 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక మరికొన్ని నగరాల్లో ఈ నిధుల వినియోగం తప్పుగా జరుగుతున్నట్టు సమాచారం.

అట్టడుగున ఢిల్లీ

ఇక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యుటి) వారీగా చూసుకుంటే ఢిల్లీ ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో ఉన్నది. ఐదేండ్లలో రూ.42.69 కోట్ల నిధులు విడుదల కాగా.. ఢిల్లీ ఖర్చు చేసింది 32 శాతం. గుజరాత్‌ వంద శాతం నిధులను ఉపయోగించుకోగా, ఒడిశా (93.55 శాతం), ఛత్తీస్‌గఢ్‌ (92.8 శాతం) తర్వాతి వరుసలో ఉన్నాయి. ఇక ఢిల్లీ తర్వాత తక్కువ మొత్తంలో నిధులను ఉపయోగించుకున్న రాష్ట్రాలు, యుటీలలో జమ్మూకాశ్మీర్‌ (40 శాతం), మేఘాలయ (44 శాతం) ఉన్నాయి.

లక్ష్యాన్ని చేరినవి 31 నగరాలే : సిఆర్‌ఇఎ

131 నగరాల్లో 31 మాత్రమే లక్ష్యాలను చేరినట్టు సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (సిఆర్‌ఇఎ) ఒక ప్రకటనలో పేర్కొన్నది. 41 నగరాలు పిఎం10 స్థాయిలలో 20-30 శాతం తగ్గింపు అనే ప్రారంభ లక్ష్యాన్ని సాధించగలిగాయని వివరించింది. ఇందులో పారదర్శకత లోపించిందనీ, ఈ మెరుగుదల ఎలా సాధించగలిగాయన్న విషయంలో స్పష్టత లేదని పేర్కొనటం గమనార్హం.

➡️