- సగటున మూడున్నరేళ్ళు తగ్గుతున్న ఆయుర్దాయం
- ఎక్యుఎల్‌ఐ హెచ్చరిక
బ్యాంకాక్ : దక్షిణాసియాలో ప్రతి ఏటా వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది. అయితే 2022లో మాత్రం ఏకంగా ఆశ్చర్యకరమైన రీతిలో 18శాతం మేరకు వాయు కాలుష్యం తగ్గిందని శాటిలైట్ డేటా తెలియచేసింది. ఆ సంవత్సరంలో దక్షిణాసియాలో గాలి నాణ్యత మెరుగుపడడంతో మొత్తంగా అంతర్జాతీయ కాలుష్యం కూడా తగ్గిందని, సానుకూలమైన వాతావరణం నెలకొనడం కూడా ఒక కారణమై వుండవచ్చని బుధవారం విడుదలైన ఒక నివేదిక పేర్కొంది.
అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన గాలిని దక్షిణాసియా ప్రాంత ప్రజలే పీలుస్తున్నారు. దీనివల్ల సగటున ఇక్కడి ప్రజల జీవిత ఆయుర్దాయం మూడున్నరేళ్ళకు పైగా తగ్గిపోతోందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఎక్యుఎల్‌ఐ) హెచ్చరించింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లైతే అనేక దేశాలకు అసలు కాలుష్య ప్రమాణాలే లేవు, లేదా పెట్టుకున్న వాటిని అందుకోవడంలో విఫలమవుతున్నారు. దీనివల్ల విస్తృత స్థాయిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు దశాబ్దాలుగా దక్షిణాసియాలో వాయు కాలుష్యం ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది. కానీ 2022లోనే తగ్గింది. శ్రీలంక కాకుండా ఈ ప్రాంతంలోని ప్రతి దేశంలో కూడా కాలుష్యం తగ్గినట్లు నమోదైందని నివేదిక పేర్కొంది. చికాగో యూనివర్శిటీ ఇంధన విధాన సంస్థ (ఎపిక్) ఈ నివేదికను రూపొందించింది.
దక్షిణాసియాలో పిఎం 2.5 స్థాయిలు తగ్గడానికి కారణాలేంటనేది నిర్ధారించడం కష్టమే కానీ సానుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొనడం కూడా కీలక పాత్ర పోషించివుండవచ్చని భావిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. 2022లో దక్షిణాసియా వ్యాప్తంగా సగటు కన్నా అధికంగా వర్షపాతం నమోదైంది. అయితే విధానపరమైన మార్పులేవైనా ప్రభావాన్ని చూపిస్తున్నాయా లేదా అనేది కాలమే నిర్ధారిస్తుందని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. కాగా సురక్షితమంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ప్రమాణాల కన్నా 8రెట్లు ఎక్కువ కలుషితమైన గాలిని దక్షిణాసియా ప్రాంత ప్రజలు పీలుస్తున్నారు.
నిశిత పరిశీలనలను కొనసాగించడం, విధానాలు అమలయ్యే దిశగా కృషి చేయడం, ప్రభావాలను పర్యవేక్షించడం ఇవన్నీ కూడా కాలుష్యం తగ్గుదలను అర్ధం చేసుకోవడానికి కీలకంగా మారతాయని ఆ నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో వాయు కాలుష్యం 18శాతం మేరా తగ్గితే ప్రపంచవ్యాప్తంగా 9శాతం కాలుష్యం తగ్గింది. అయితే మధ్య ప్రాచ్యంలో, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 13శాతం ఎక్కువగా కాలుష్యం పెరిగింది.
క్షేత్ర స్థాయిలో వాయు కాలుష్యం డేటా లేకపోవడం వల్ల విధానాల రూపకల్పనకు, వాటి అమలుకు ఇబ్బందులు కలుగుతున్నాయని నివేదిక పేర్కొంది.
”అత్యధిక కాలుష్య దేశాల్లో అసలు గాలి నాణ్యతపై డేటానే వుండడం లేదు. ఒకవేళ డేటా అంటూ ఏదైనా నమోదు చేసినా అది కూడా అరకొరగానే వుంటోంది. దాంతో విధానాల రూపకల్పన సమయంలో దీనిపై దృష్టి పెట్టడానికి అవకాశం వుండడం లేదు.” అని ఎపిక్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ క్రిస్తా హసెన్‌కాఫ్ వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా డేటా నమోదు చేయడానికి వీలుగా గాలి నాణ్యతను పరిశీలించేందుకై ఎయిర్ క్వాలిటీ మోనిటర్లను నెలకొల్పాలని, వాటి కోసం 15లక్షల డాలర్లతో గతేడాది నిధిని ప్రారంభించారు. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఈ వాయు కాలుష్యంపై పోరాడేందుకు అందే నిధులు మాత్రం చాలా తక్కువగా వుంటున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రికా ఖండంలో బాగా కాలుష్యం వుండే దేశాల్లో ఈ వాయు కాలుష్యమనేది హెచ్‌ఐవి, ఎయిడ్స్ కన్నా, మలేరియా, నీటి పారిశుధ్యం కన్నా ప్రమాదకరమైన ప్రాణాంతక ముప్పుగా పరిణమించిందని ఆ నివేదిక హెచ్చరించింది.