లక్నో : కుంభమేళా పేరుతో యుపి ప్రభుత్వం గంగానదిలో మట్టిని తవ్వి, అమ్ముకుంటోందని సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్‌యాదవ్ బుధవారం దుయ్యబట్టారు. ఇది పర్యావరణ నేరమని మండిపడ్డారు. కుంభమేళా కోసం గంగానదిలో మట్టిని తవ్వుతున్న వార్తల ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ”నదులు తమ దారులను తామే సృష్టించుకుంటాయనడానికి చరిత్ర సాక్ష్యం. తమ ప్రవాహాన్ని కొనసాగించేందుకు నదులు సహజంగా, స్వయంగా మార్గాన్ని ఏర్పరుచుకుంటాయి. ఈ భౌగోళిక సత్యాన్ని అంగీకరించకుండా నదుల ప్రవాహాన్ని తారుమారు చేయడం పర్యావరణ నేరం” అని ఆ ఫోటోలకు జత చేశారు.
మహాకుంభమేళా పేరుతో ప్రయాగ్‌రాజ్‌లో గంగానదిలో తవ్వకాలు చేపట్టడం వెనుక ఉద్దేశ్యం.. వారి సొంత వ్యక్తులకు కాంట్రాక్టులు అప్పగించి, అవినీతి ద్వారా డబ్బు సంపాదించేందుకేనని అన్నారు. నదుల ప్రవాహం ప్రకృతి సిద్ధంగా ఉండాలని, ఇష్టానుసారంగా మట్టిని తవ్వడం, ప్రవాహాన్ని మార్చడం సరికాదని అన్నారు. ఇది పర్యావరణ నేరం, అనుచిత చర్య అని అన్నారు. యుపిలో మహాకుంభమేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది.