లక్నో : మన ముఖ్యమంత్రి యోగి తీస్ మార్ ఖాన్ అని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. హోలీ-నమాజ్ వివాదంపై గురువారం ఆయన స్పందించారు. యుపి సిఎం తీస్‌మార్ ఖాన్ అని, ఆయనకు ముప్ఫై సంఖ్య అంటే చాలా ఇష్టమని ఎద్దేవా చేశారు. ఇటీవల కుంభమేళాలో మరణించిన వారి సంఖ్య 30, ఆర్థిక కార్యకలాపాల ద్వారా గడించినది రూ.30 కోట్లు .. తీస్‌మార్‌ఖాన్ లెక్కను యోగి తప్ప ఎవరూచెప్పలేరని దుయ్యబట్టారు. యోగి పాలనలో రాజ్యాంగం సురక్షితంగా లేదని ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలు ఎల్లప్పుడూ అన్ని పండుగలను కలిసి జరుపుంటారని అన్నారు. అప్రమత్తత పేరుతో యుపి ప్రభుత్వం మసీదులపై టార్పాలిన్‌లు కప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలోని గంగ-యమునా సాంప్రదాయం వర్ధిల్లాలని, ప్రజలు గత కొన్నేళ్లుగా సోదరభావంతో కలిసి జీవిస్తున్నారని, భవిష్యత్తులోనూ కలిసి జీవించాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలు పండుగలు, వాటికి సంబంధించిన వ్యాపారాలతో అనుసంధానమై జీవనం సాగిస్తున్నారని అన్నారు. దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఉత్సాహం, ఆనందం కలిగించే రంగుల పండుగని అన్నారు.