- ముస్లిం మహిళలకూ భరణం కోరే హక్కు ఉంది
- స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: విడాకుల అనంతరం మహిళలకు తమ మాజీ జీవిత భాగస్వామి నుండి భరణం పొందడం భిక్ష కాదని, అది ఓ హక్కు అని, చట్ట ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలూ ఇందుకు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్ తన మాజీ జీవిత భాగస్వామికి 20 వేలు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుపై చేసిన అప్పీలును విచారించిన జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిV్‌ాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు నిచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి)-1973 లోని సెక్షన్ 125 ప్రకారం చట్ట బద్ధంగా విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకూ భరణం పొందే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 125 ప్రకారం మతంతో ప్రమేయం లేకుండా వివాహితులైన ఏ మహిళకైనా ఇది వర్తిస్తుందని చెప్పింది. ‘భరణం ఇవ్వడం అనేది ఏదో దయతో పెట్టే భిక్ష కాదు. భార్య తమపై మానసికంగా, ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని కొందరు భర్తలు ఇంకా గుర్తించడం లేదు. ఇల్లాలి పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది’ అని ధర్మాసనం ఘాటుగానే హెచ్చరించింది.