వ్యవస్థలూ..నిర్మాణాలు అన్నీ కూలిపోతున్నాయి

  • అవినీతిని దాచిపెడుతున్నమోడీ సర్కార్‌
  • అయోధ్యలోనూ అక్రమాలే
  • సిపిఎం రాజ్యసభ ఎంపి వి.శివదాసన్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆర్థిక అవినీతిని బిజెపి దాచిపెడుతోందని సిపిఎం రాజ్యసభ ఎంపి వి శివదాసన్‌ విమర్శించారు. దేశంలో ఒకవైపు మోడీ సర్కార్‌ వినాశకర చర్యలతో రాజ్యాంగ వ్యవస్థలు ఒక్కటొక్కిటిగా కూలిపోతుండగా..మరోవైపు బిజెపి అవినీతి, అక్రమాల ఫలితంగా మౌలిక సదుపాయాల నిర్మాణాలు కూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణంలోనూ లోపాలు వెలుగుచూస్తున్నాయని తెలిపారు. రామమందిరం పైకప్పు లీక్‌ అవుతుందని స్వయంగా పూజారి వెల్లడించారని, రూ.1800 కోట్ల భారీ మొత్తంతో నిర్మించిన ఆలయం పరిస్థితే ఇలా వుంటే దేశంలో అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. రామ మందిరాన్ని నరేంద్ర మోడీయే ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. రూ.845 కోట్లతో నిర్మించిన రామ్‌ పాత్‌ పెద్ద పెద్ద గుంతలతో నిండిపోయిందన్నారు. దీనిని కూడా మోడీయే ప్రారంభించారని గుర్తు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిపిఎం తరపున వి శివదాసన్‌ మాట్లాడారు. ఢిల్లీ, రాజ్‌కోట్‌, జబల్‌పూర్‌ విమానాశ్రయాల్లో టెర్మినల్స్‌ కూలిపోయాయని, అటల్‌ అంటే ధృఢమైనదని అర్థమని.. కానీ ముంబయి అటల్‌ సేతుకు సైతం బిజెపి అవినీతితో పగుళ్లు వచ్చాయని తెలిపారు. దీనికోసం ఏకంగా రూ.17,480 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని పేర్కొన్నారు. ఒక్క బీహార్‌లోనే 20 రోజుల్లో ఆరు వంతెనలు కూలిపోయాయని తెలిపారు. విద్యారంగంలో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదని పేర్కొన్నారు. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని విమర్శించారు. అందుకే ‘కెజి టు పిజి’ నిర్వహణకు ఎన్‌టిఎ అనే ఏజెన్సీని ప్రారంభించారని శివదాసన్‌ చెప్పారు.

➡️