- రూపొందించిన వామపక్షాలు
- 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారానికి పిలుపు
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌కు వామపక్షాలు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను రూపొందించాయి. వీటిని ఈ నెల 14వ తేది నుండి 20 వ తేది వరకు దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించాయి. సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్‌ఎస్‌పి, అఖిల భారత ఫ్వారర్డ్ బ్లాక్ నేతలు జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయించారు. ఇంటింటికి తిరగడం, వీధి సమావేశాలు నిర్వహించడం, ప్రదర్శనలు, ర్యాలీలు ద్వారా దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలను కలుసుకోవాలని, సామూహిక ప్రచారంచేపట్టాలని నిర్ణయించారు. దీనికోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించు కోవాలని తమ రాష్ట్ర శాఖలకు ఆ పార్టీలు సూచించాయి. ఈ మేరకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, సమన్వయకర్త ప్రకాష్ కరత్, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఎఐఎఫ్‌బి ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌లు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజల తక్షణ, మౌలిక అవసరాలకు కేంద్ర బడ్జెట్ దారుణంగా ద్రోహం చేసింది. మూకుమ్మడి నిరుద్యోగం, వేతనాల కుంగుబాటు, ప్రజల్లో కొనుగోలు శక్తి కుంచించుకుపోవడం కారణంగా ఆర్థిక వ్యవస్థలో తగ్గిన డిమాండ్ సమస్యను పరిష్కరించడానికి బదులుగా మోడీ ప్రభుత్వం సంపన్నులకు మరిన్ని రాయితీలు ఇస్తోంది. ఖర్చుల్లో కోతలు పెడుతోంది.’ అని వారు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. సంపన్నులపై, బడా కార్పొరేట్ సంస్థలపై పన్నులు విధించడం, ఉపాధి కల్పనకు సాయపడేలా ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించడం, కనీస వేతనాలకు హామీ కల్పించడం ద్వారా వనరులను సమీకరించడానికి బదులుగా అందుకు విరుద్ధమైన మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుందని విమర్శించారు. ప్రభుత్వం అనుసరించే ఈ విధానాల వల్ల కొద్దిమంది వద్దే సంపద పోగుపడుతుందని వారు తెలిపారు.
నిరుద్యోగాన్ని విస్మరించారు
నిరుద్యోగ సమస్యను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని వామపక్ష నేతలు తెలిపారు. ద్రవ్యో ల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆహార సబ్సిడీలు, వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పట్టణాభివృద్ది రంగాలపై పెట్టే ఖర్చు గతేడాది కంటే బాగా తగ్గిపోయిందని పేర్కొ న్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు రూ.86 వేల కోట్ల వద్దే నిలిపివేయడాన్ని ప్రస్తావించారు.
‘ఆ’ ఊరట కొద్దిమందికే …
రూ.12లక్షలకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల కొద్దిమందికి మాత్రమే ఊరట లభిస్తుందని వివరించారు. అదే సమయంలో ధరల పెరుగుదల, జిఎస్‌టి వంటి పరోక్ష పన్నులతో ఇబ్బందులు పడుతున్న కార్మిక వర్గంలోని విస్తృత ప్రజానీకాన్ని పూర్తిగా విస్మరించారని తెలిపారు. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల ఎదురైన నష్టాన్ని సంపన్నులపై, కార్పొరేట్లపై అధికంగా పన్నులు విధించడం ద్వారా తగ్గించుకోవచ్చని వివరించారు. అయితే, ప్రభుత్వం అలా చేయకుండా కార్పొరేట్ రంగానికి, సూపర్ రిచ్ వర్గాలకు వరాల మూటను అందించింది.
‘వాటి’ని తిరస్కరిస్తున్నాం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలన్నింటిని తాము తిరస్కరిస్తున్నట్లు వామపక్షనేతలు ప్రకటనలో తెలిపారు. వాటి స్థానంలో తాము సూచించే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వేతనాలు పెంచడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. తాము రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ప్రజల విద్యా హక్కుకు, ఆరోగ్య, సామాజిక ప్రయోజనాల హక్కులకు హామీ ఇస్తాయని తెలిపారు. వీటిని బడ్జెట్‌లో ప్రవేశపెట్టి, ఫైనాన్స్ బిల్లులో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవి ప్రత్నామ్నాయ ప్రతిపాదనలు …
1. దేశంలో 200 మంది శత కోటీశ్వరుల(డాలర్లలో)పై 4శాతం సంపద పన్ను ప్రవేశపెట్టాలి, కార్పొరేట్ పన్నును పెంచాలి.
2. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలి. వ్యవసాయ మార్కెటింగ్‌పై జాతీయ విధాన ముసాయిదాను ఉపసంహరించాలి.
3. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా చేపట్టే ప్రభుత్వరంగ ప్రైవేటీకరణ చర్యలను, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు రంగానికి బదలాయించడాన్ని ఆపాలి. బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డిఐలను ఉపసంహరించాలి.
4.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను 50శాతం పెంచాలి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టాలి. వృద్ధాప్యపు పెన్షన్లు, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం కేంద్ర కేటాయింపులు పెంచాలి.
5. ఆరోగ్య రంగ కేటాయింపులను జిడిపిలో 3శాతానికి పెంచాలి. విద్యా రంగానికి జిడిపిలో ఆరు శాతానికి కేటాయింపులు పెంచాలి.
6. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహార సబ్సిడీని పెంచాలి.
7. ఎస్‌సి, ఎస్‌టి రంగాలకు, మహిళా, శిశు సంక్షేమానికి కేటాయింపులను గణనీయంగా పెంచాలి. వీటిల్లో ఐసిడిఎస్‌కు కూడా కేటాయింపులు పెరగాలి. అలాగే స్కీమ్ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాల్లో కేంద్రం వాటాను పెంచాలి.
8. రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా నిధులను గణనీయంగా పెంచాలి. రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులను, సర్‌చార్జిలను రద్దు చేయాలి.