సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్
అవి పార్టీల, అభ్యర్థుల హక్కును హరిస్తాయి
న్యూఢిల్లీ : ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల నిబంధనలకు ప్రతిపాదిత సవరణలపై పొలిట్‌బ్యూరో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వీడియో, ఇతర డిజిటల్ ట్రయల్స్‌తో సహా ఎలక్ట్రానిక్ రికార్డులు పొందేందుకు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని ఈ సవరణల ద్వారా హరించాలని మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
‘ఎన్నికల కమిషన్ డిజిటల్ విధానాన్ని చేపట్టిన తొలినాళ్లలో మరింత పారదర్శకత ఉండేలా చూడడం కోసం రాజకీయ పార్టీలతో సంప్రదించింది. ఇప్పుడు కొత్త నిబంధనలు రూపొందించేందుకు ఎన్నికల కమిషన్‌తో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపినట్లు మీడియాలో వార్తలచ్చాయి. ఎంతోకాలంగా అనుసరిస్తూ వస్తున్న స్థిరమైన సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల సంఘం ఇప్పుడు వ్యవహరిస్తోంది. కొత్త నిబంధనల విషయంలో రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే వీటికి సమ్మతి ఉన్నట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు పిటిషనర్‌కు గల హక్కును ప్రశ్నించేలా ప్రభుత్వ వాదన ఉంది. ఈ వైఖరే నిబంధనల రూపకల్పనలో రాజకీయ పార్టీల ప్రమేయానికి సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులను పూర్తిగా మినహాయించేలా చేస్తోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
గతంలో సిపిఎం అనుభవం మరీ ముఖ్యంగా త్రిపురలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పార్టీ చేసిన ఆరోపణల కారణంగా పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రాఫిక్ రికార్డులను పరిశీలించి, చివరికి ఆ రెండు నియోజకవర్గాలలోని దాదాపు సగం పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించాల్సి వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానం ఎన్నికల ప్రక్రియలో అంతర్భాగమైపోయిన నేటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ప్రతిపాదన తిరోగమన చర్య అని పొలిట్ బ్యూరో పేర్కొంది. కాబట్టి ఎన్నికల నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో డిమాండ్ చేసింది.