అమేథీలో ఇరానీకి అగ్ని పరీక్షే

May 16,2024 07:10 #general elections., #Uttar Pradesh

  సీనియర్‌ నేత శర్మ నుంచి తీవ్ర పోటీ
అమేథీ : ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన అమేథీ లోక్‌సభ స్థానంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. బిజెపి అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ, సీనియర్‌ నేత కేఎల్‌ శర్మ తలపడుతున్నారు. దీంతో అమేథీ ఇప్పుడు కూడా వీవీఐపీ స్థానంగానే కొనసాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అమేథీలో పోటీ చేసి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు కూడా రాహుల్‌ ఇదే స్థానం నుండి పోటీ చేస్తారని అందరూ భావించినా ఆయన రాయబరేలీకి మారారు. ఒకప్పుడు ఇందిర కుటుంబానికి ఈ రెండు స్థానాలూ కంచుకోటలుగా ఉండేవి. ఈ నెల 20న అమేథీలో పోలింగ్‌ జరుగుతుంది.

అసమ్మతి-అసంతృప్తి నిజమే
అమేథీలో ఇరానీ పోటీ చేయడం ఇది మూడోసారి. 2014లో తొలిసారిగా పోటీ చేసి రాహుల్‌ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో పోటీ చేసి 55,000 ఓట్ల మెజారిటీతో ఆయనపై గెలిచారు. అమేథీలో తాను తరచూ పర్యటిస్తూనే ఉన్నానని ఇరానీ చెప్పుకుంటారని, కానీ ఆమె ఎప్పుడో ఓసారి చుట్టం చూపుగా వచ్చి పోతారని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే దీపక్‌ సింగ్‌ చెప్పారు. స్థానిక బిజెపి నాయకులే ఆమె ఓటమిని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. స్థానిక పార్టీ నేతలను ఆమె బహిరంగంగానే అవమానిస్తుంటారని, బహిరంగ సభల్లో వేదిక దిగిపోవాలని ఆజ్ఞాపిస్తారని తెలిపారు. ఇరానీ అభ్యర్థిత్వంపై కొంత అసమ్మతి ఉన్న మాట నిజమేనని ఓ బిజెపి మద్దతుదారు కూడా అంగీకరించాడు. అయితే అభ్యర్థిని చూడవద్దని, మోడీ-యోగి ద్వయాన్నే చూడాలని ఆయన ఓటర్లను కోరాడు. శర్మ అంటే తమకు వ్యతిరేకత ఏమీ లేదని, ఆయన తన జీవితాన్ని గాంధీ కుటుంబం కోసం త్యాగం చేశారని చెప్పాడు. ఇరానీకి ఆయన గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో అందరికీ తెలుసునని, అలాంటప్పుడు ఎవరైనా ఓటును ఎందుకు వృథా చేసుకుంటారని ప్రశ్నించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బాగానే ఓట్లు వస్తాయని టీ దుకాణాన్ని నడిపే శివ్‌ ప్యారే తెలిపారు. అయితే గాంధీ కుటుంబం నుండి ఎవరైనా పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. స్థానిక ఎంపీ అయిన ఇరానీ వ్యవహార శైలిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నదని చెప్పారు.

ప్రియాంక ప్రచారంతో జోష్‌

మరోవైపు ఇరానీ అమేథీలో ప్రారంభమైన కోకా-కోలా బాట్లింగ్‌ ప్లాంటు గురించి చెప్పుకుంటున్నారు. గాంధీ కుటుంబానికి యాభై సంవత్సరాల సమయం ఇచ్చారని, కాబట్టి తనకు మరికొంత సమయం ఇవ్వాలని ఆమె వేడుకొంటున్నారు. ఇరానీకి అమేథీలో సొంత ఇల్లు కూడా ఉన్నదని బిజెపి నాయకులు గుర్తు చేస్తున్నారు. అటు కాంగ్రెస్‌ తరఫున ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పార్టీ ప్రచారం ఊపందుకుంటోంది. కాంగ్రెస్‌ కార్యకర్తల్లో నూతనోత్సాహం కన్పిస్తోంది. అమేథీలో అభ్యర్థి శర్మతో కలిసి ప్రియాంక ఇప్పటికే 15 కార్నర్‌ మీటింగులు నిర్వహించారు. అమేథీతో తన కుటుంబానికి ఉన్న పురాతన సంబంధాలను ప్రియాంక గుర్తు చేస్తున్నారు.

➡️