బెంగళూరు : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల గొంతును అణచివేసేందుకు ఇడిని రాజకీయ ఆయుధంగా దుర్వినియోగం చేస్తున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.
‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా ప్రతీకార రాజకీయ చర్యల కొనసాగింపులో భాగంగానే సోనియా, రాహుల్ గాంధీలపై ఇడి ఛార్జీషీట్ దాఖలు చేసింది’ అని సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
కాగా, ఇది కేవలం కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు నేతలపై ప్రతీకార చర్య మాత్రమే కాదు.. ప్రతిపక్షపార్టీలకు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే పౌరుల గొంతు నొక్కేస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెసిన హెచ్చరిక ఇది. కాంగ్రెస్ పార్టీ కూడా సత్యం, న్యాయం యొక్క బలంతో ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలను ఎదుర్కొంటుంది అని సిద్ధరామయ్య ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
