మణిపూర్‌, కులగణనపై అమిత్‌షా దృష్టి పెట్టాలి : ఖర్గే

న్యూఢిల్లీ : దేశంలో తీవ్ర అంశాలైన మణిపూర్‌, కులగణనపైన దృష్టి సారించాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సూచించారు. పట్టణాల్లో సెప్టిక్‌ ట్యాంకులు, మురుగు కాల్వలను శుభ్రపరిచే కార్మికుల్లో 92 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలేనని ప్రభుత్వం విడుదల చేసిన తాజా సర్వే నివేదిక తెలిపింది. ఈ సర్వే గురించి సోమవారం ఎక్స్‌ వేదికగా ఖర్గే ప్రస్తావించారు. బిజెపి కులగణనకు వ్యతిరేకమని, కులగణన చేపడితే ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఇడబ్ల్యుఎస్‌ తదితర తరగతుల వారు ఏ పని ద్వారా జీవనోపాధి పొందుతున్నారో, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఏమిటో, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఏమేరకు పొందుతున్నారో దేశమంతా తెలుస్తుందని పేర్కొన్నారు. అందుకే బిజెపి ఈ అంశాలను పట్టించుకోవడంలేదని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

➡️