బీఫ్ బిర్యానీ వివాదంపై స్పందించిన ఎఎంయు
అలీఘర్ : భోజనంలో బీఫ్ బిర్యానీ వడ్డించారనే వివాదంపై అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఎఎంయు) స్పందించింది. అది ఒక టైపింగ్ తప్పిందంగా వివరణ ఇచ్చింది. ఇందుకు బాధ్యలైన వారికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎఎంయు పరిపాలన విభాగం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలీఘర్‌లోని ఎఎంయులో ఆదివారం మధ్యాహ్న భోజన సమయంలో సర్ షా సులైమాన్ హాల్‌లో బీఫ్ బిర్యానీ వడ్డించారని సోషల్ మీడియాలో విస్తృతంగా వార్త ప్రచారం కాబడింది. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా వైరల్‌గా మారింది. ఈ ఫోటో ప్రకారం ఒక నోటీసులో ‘ఆదివారం భోజన మెనూ మార్చబడింది. డిమాండ్ ప్రకారం చికెన్ బిర్యానీకి బదులుగా బీఫ్ బిర్యానీ వడ్డించబడుతుంది’ అని ఉంది.
దీనిపై సమాధానం ఇస్తూ ‘ఈ విషయం మా దృష్టికి వచ్చింది. టైపింగ్ తప్పిదం కారణంగా ఇలాంటి నోటీసు ఏర్పాటయింది. ఈ నోటీసుకు ఎలాంటి అధికారిక సంతకాలు లేవు. ఈ నోటీసు తయారు చేసిన ఇద్దరు సీనియర్ విద్యార్థులకు షోకాజ్ నోటీసు జారీ చేశాం. విశ్వ విద్యాలయ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా మేం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని పరిపాలన విభాగం అధికారులు తెలిపారు.
