శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్ సైఫుల్లాతో సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగతా ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులుగా సమాచారం. కిష్త్వార్‌లోని ఛత్రు అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ 9న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
సెర్చ్ సమయంలో ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. ఒక ఉగ్రవాది హతమైనట్లు ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది. తరువాత, మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు జాతీయ మీడియా నివేదించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటనలు రాలేదు.
కథువాలో సరిహద్దులోకి చొరబడిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది. దోడా జిల్లాలోని భదేర్వే సెక్టార్‌లో ఉగ్రవాదుల ఉనికిపై సమాచారం అందడంతో నిఘాను ముమ్మరం చేశారు. గత 19 రోజుల్లో కథువా, ఉధంపూర్ మరియు కిష్త్వార్‌లలో ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. వీటిలో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. నలుగురు పోలీసు సిబ్బంది మృతి చెందారు. ఇదిలా ఉండగా, అఖ్నూర్ సెక్టార్‌లోని కేరీ బట్టల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఇటీవల పాకిస్తాన్ సైన్యం మళ్ళీ కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు తెలిసింది.