- 900కు పైగా సంస్థల డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆటవిక లైంగికదాడి ఘటనలకు సంబంధించిన కేసులను త్వరితగతిన, నిస్పాక్షికంగా, స్వతంత్రంగా విచారణ జరపాలని కార్మిక సంఘాలు, మహిళా-విద్యార్థి గ్రూపులు, ప్రముఖులతో కూడిన 900కు పైగా సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు అవి ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘వరుసగా చోటుచేసుకుంటున్న భయానక ఘటనల్లో కోల్‌కతా ఉదంతం తాజాగా జరిగిందన్న విషయాన్ని మరచిపోకూడదు. మహిళలకు రక్షణ కల్పించడానికి చట్టాలు చేశారు. అయితే ఆ చట్టాల అమలును పర్యవేక్షించే యంత్రాంగం కేవలం కాగితాలపై మాత్రమే కన్పిస్తోంది. అది కేంద్రమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా…లైంగిక హింసకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. వేధింపులకు పాల్పడే వారు తప్పించుకునే అవకాశం ఇస్తున్నాయి’ అని ఆ ప్రకటన వేలెత్తి చూపింది.
వ్యవస్థలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు విఫలమైతే వారిని బాధ్యులను చేసేందుకు సుప్రీంకోర్టు జోక్యం ఉపయోగపడుతుందని ఆ ప్రకటన ఆశాభావం వ్యక్తం చేసింది. ‘సమాజంలో మహిళలకు స్వేచ్ఛ ప్రాథమిక గ్యారంటీగా ఉండేలా చేసేందుకు మేము కృషి చేస్తాము. మార్పుకు ఇప్పుడు సమయం వచ్చింది. బాధితులు, వారి బంధువుల పక్షాన నిలవడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి. చట్టాన్ని కఠినంగా అమలు చేయలేకపోతున్నాయి’ అని ఆయా సంస్థలు అభిప్రాయపడ్డాయి.