నేడు మోడీ ప్రమాణస్వీకారం – ‘ఇండియా’ నేతలకు అందని ఆహ్వానం

  • నేడు మోడీ ప్రమాణస్వీకారం
  • సాయంత్రం 7.15 గంటలకు వేడుక
  • దేశ, విదేశాల నుంచి
  • 8 వేల మంది అతిథులు

ప్రజాశక్తి-న్యూడిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో సాధారణ మెజారిటీ సాధించలేకపోయిన బిజెపి ఈ దఫా ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎన్‌డిఎ నేతగా ఎన్నికైన నరేంద్ర మోడీ ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సావానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన నిపుణు లు, కళాకారులు సహా 8,000 మంది అతిథులు హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాల ఐక్య వేదిక అయిన ‘ఇండియా’ ఫోరం నేతలకు ఎవ్వరికీ ఆహ్వానాలు పంపలేదని సంబంధికులు తెలిపారు. శనివారం సాయంత్రం 3 గంటల వరకు తమకు ఆహ్వా నాలు అందలేదని ‘ఇండియా’ నేతలు పలువురు పేర్కొన్నా రు. ఆహ్వానాలు అందనప్పడు ప్రమాణస్వీ కారోత్సవానికి వెళ్లడంపై ఆలోచన కూడా ఉండదని వారు పేర్కొన్నారు.
బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ ఎన్నికకావడం, ఆ తర్వాత జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షాలు తమ మద్దతు లేఖలను సమర్పించడం, అనంతరం గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీని ప్రధానిగా నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రి మండలి సభ్యులతో ముర్ము ప్రమాణం చేయిస్తారు.
ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి నేతలు తరలిరానున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్జి కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో సహా బహుళ స్థాయి భద్రతాతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ మీదుగా విమానాలు, డ్రోన్లు రాకపోకలను నిషేదిస్తూ ఈ ప్రాంతాన్ని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఈ నెల 10 వరకు ఈ నిషేదం అమలులో ఉంటుంది. విదేశీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన హౌటళ్లలో మెరుగైన భద్రతా చర్యలు అమల్జేస్తున్నారు. లీలా, తాజ్‌, ఐటిసి మౌర్య, క్లారిడ్జ్‌లు, ఒబెరారు వంటి ప్రముఖ హోటళ్లు వద్ద పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరింపజేశారు.
తరలిరానున్న దేశాధినేతలు
ఆదివారం జరగనున్న మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి పొరుగుదేశాలైన మాల్దీవులు, బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌, సీషెల్స్‌ నుంచి ఆయా దేశాధినేతలు తరలిరానున్నారు. ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ పేరిట ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ భారత్‌ పంపిన ఆహ్వానాలను పొరుగుదేశాల అధినేతలు స్వాగతించారు.

కేబినెట్‌లో 27-30 మంది మంత్రులు
కేంద్ర కేబినెట్‌లో ఈ దఫా 27 నుంచి 30 మంది వరకు మంత్రులు ఉండే అవకాశముంది. వీరిలో మూడో వంతు బెర్తులు ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాలకే కేటాయించాల్సివుంటుంది. వీరితో పాటు సహాయ మంత్రులు కూడా పెద్ద సంఖ్యలో ఉండే అవకాశముంది. ప్రతి నలుగురు, ఐదుగురు ఎంపిలకు ఒక క్యాబినెట్‌ మంత్రి పదవి, ప్రతి ఇద్దరికి ఒక సహాయ మంత్రి పదవుల ఫార్ములతా కేబినెట్‌ పదవులు కేటాయించేవీలుందని ఎన్‌డిఎలోని కీలక నేత ఒకరు తెలిపారు. కేబినెట్‌ కూర్పుపై ఇప్పటికే ప్రధాని మోడీ దిశానిర్దేశంలో కేంద్ర మంత్రులుగా రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, జెపి నడ్డా భాగస్వామ్యపక్షాల నేతలతో చర్చలు జరిపారు. మోడీ ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోనూ ఆయన మద్దతుదారులు 22 నగరాల్లో వేడుకల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బిజెపి-యుఎస్‌ఎ న్యూయార్క్‌, జెర్సీ సిటీ, వాషింగ్టన్‌ డిసి, బోస్టన్‌, టంపా, అట్లాంటా, హ్యూస్టన్‌, డల్లాస్‌, చికాగో, లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

విదేశీ నాయకులకేనా ఆహ్వానాలు : జైరాం రమేశ్‌


ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి విదేశీ నాయకులను ఆహ్వానించడానికే ప్రాధాన్యత ఇచ్చారు కానీ, ప్రజాతీర్పుతో నెగ్గిన ‘ఇండియా’ ఫోరం నేతలను ఆహ్వానించలేదని పలువురు నేతలు వాపోయారు. ‘ఇండియా’ ఫోరం నేతలకు ఎవ్వరికీ ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ శనివారం సాయంత్రం 3 గంటలకు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి కేవలం విదేశీ నాయకులనే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మా ఫోరం నేతలెవ్వరికీ ఇప్పటి వరకు ఆహ్వానాలు అందలేదు. ఆహ్వానాలు అందినప్పుడు వెళ్లలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటాం’ అని జైరాం రమేశ్‌ అన్నారు.

మేం వెళ్లం : మమత బెనర్జీ


చట్ట విరుద్ధంగా, అప్రజా స్వామికంగా ఏర్పాటవు తున్న ఒక ప్రభుత్వానికి తాము శుభాకాంక్షలు చెప్పజాలమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీ అన్నారు. మోడీ ప్రభుత్వం గతంలో ‘మంద బలం’తో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వంటి వినాశకరమైన చట్టాలను తీసుకొచ్చిందని, వాటిని రద్దు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కొల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘చట్ట వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వానికి మేం శుభాకాంక్షలు చెప్పలేం. పార్టీలను విచ్ఛిన్నం చేయడమే వారి పని. అయితే చాలా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వారే కూలిపోతారు. గతంలో ఒక రోజు మాత్రమే మనుగడ సాగించిన ప్రభుత్వాలను చూశాం. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. పైగా ప్రమాణస్వీకారోత్సవానికి మాకు ఆహ్వానం అందలేదు. అందువల్ల మేము వెళ్లే ప్రసక్తే లేదు’ అని ఆమె తెలిపారు. కాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్‌గా మమత బెనర్జీ ఎన్నిక కాగా, లోక్‌సభలో పార్టీ నేతగా సుదీప్‌ బంధోపాధ్యాయ, ఉప నేతగా కకోలి ఘోష్‌ దస్తిదార్‌ ఎన్నికయ్యారు. రాజ్యసభ పక్ష నేతగా డెరెక్‌ ఒబ్రయిన్‌, ఉపనేతగా తొలిసారి ఎంపీగా ఎన్నికైన సాగరికా ఘోష్‌ ఎన్నికయ్యారు.

➡️