17.1 శాతం మందికి వయసుకు తగిన బరువు లేదు
కేంద్ర ప్రభుత్వ పోషణ్ ట్రాకర్ ప్రకారం నివేదిక
న్యూఢిల్లీ : దేశంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో చదువుకుంటున్న చిన్నారుల్లో 37.7 శాతం మంది కుంగుబాటుకు గురవుతున్నారు. 17.1 శాతం మందికి వయసుకు తగిన బరువు లేదు. కేంద్ర ప్రభుత్వ ‘పోషణ్ ట్రాకర్’ ప్రకారం ఫిబ్రవరి నాటికి అంగన్‌వాడీల్లో 8.8 కోట్ల మంది పిల్లలు (0-6 సంవత్సరాల మధ్య వయస్కులు) ఉన్నారు. వీరిలో 8.5 కోట్ల మంది బరువు, ఎత్తును పరీక్షించి వారిలో ఎదుగుదల ఎలా ఉన్నదో పరిశీలించారు. బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని ఎలా నివారిస్తారంటూ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ లిఖిలపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారాన్ని అందించారు. దేశవ్యాప్తంగా పిల్లల్లో పోషకలోపాల సూచికలు మెరుగుపడుతున్నాయని ఆమె తెలిపారు. 2021 నాటికి దేశంలో ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు 13.7 కోట్లు ఉన్నారని, 0-6 సంవత్సరాల గ్రూపులో 16.1 కోట్ల మంది ఉన్నారని వివరించారు.
