రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించారని పోలీసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా కాంకేర్, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దులోని అడవిలో ఆదివారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయని అన్నారు.
నార్త్ బస్తర్, మాద్ డివిజన్‌లకు చెందిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారన్న సమాచారం మేరకు జిల్లా రిజర్వ్‌గార్డ్ (డిఆర్‌జి), సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్)ల సంయుక్త బృందం గాలింపు చేపట్టిందని అన్నారు. ఎన్‌కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుండి ఓ మావోయిస్టు మృతదేహాన్ని, తుపాకీని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఘటనా స్థలం నుండి భద్రతాదళాలు తిరిగి రాలేదని, ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుందని ఆ ప్రకటనలో తెలిపారు.
శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఏడాది జనవరి నుండి ఛత్తీస్‌గఢ్‌లో వేర్వేరు ఎన్కౌంటర్లలో 50 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. కాంకేర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లో అత్యధికంగా 34 మంది మావోయిస్టులు మరణించారు. జనవరి 20-21 తేదీలలో రాయ్‌పూర్ డివిజన్ పరిధిలోని గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మరణించారు.
గతేడాది వేర్వేరు ఎన్కౌంటర్లలో 219 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.