- మూడు వారాల్లో రెండో ఘటన
న్యూఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ రైతునేత దల్లేవాల్ నలబై రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోక పోవడానికి నిరసనగా మరో అన్నదాత ప్రాణ త్యాగం చేశాడు. శంభు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న తరణ్ తరణ్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల రైతు గురువారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడువారాల వ్యవధిలో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం 9 గంటలకు ఆల్పాహార సమయంలో రైతు ఆత్మాహత్యాయత్నం చేయగా, ఆయనను వెంటనే సమీపంలోని రాజ్‌పురా సివిల్ ఆసుపత్రికి, అక్కడ నుంచి పాటియాలోని ప్రభుత్వ రాజేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గురించి రైతు నాయకులు మాట్లాడుతూ, రైతు సమస్యలపై కేంద్రం స్పందించకపోవడానికి వ్యతిరేకంగానే ఆత్మహత్య చేసుకున్నారు’ అని తెలిపారు. శంభు వద్ద, అలాగే ఖనౌరీ వద్ద గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు ఆందోళన చేస్తు న్నారు. డిసెంబరు 18న లూథియానాకు చెందిన మరొక రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నారు.