తిరునల్వేలి : తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి వ్యవహార శైలిని విమర్శిస్తూ పాలక డిఎంకె కార్యకర్తలు తిరునల్వేలి సహా పలు నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలనే, అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయాలనే బిజెపి రహస్య ఎజెండాను అమలు చేసేందుకు రవి పదే పదే ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు విమర్శించారు. ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఆయన కల తమిళనాడులో ఎన్నటికీ నెరవేరదని స్పష్టం చేశారు. రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించిన హక్కులపై గవర్నర్ రవి దాడి చేస్తున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగాలతో తమిళనాడు చరిత్రను వక్రీకరిస్తున్నారని, తమిళులను, ఈ రాష్ట్రం నుండి తయారైన దిగ్గజాలను అవమానపరుస్తున్నారని వారు విమర్శించారు. ఇదే రీతిలో ఆయన వ్యవహరిస్తే రాష్ట్రం నుండి వెళ్ళిపోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వానికి సమస్యను సృష్టించేందుకు గవర్నర్‌తో కలిసి అన్నా డిఎంకె కుమ్మక్కయిందని వారు ఆరోపించారు. తిరునల్వేలిలో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టెంకాసి, నాగర్‌కోయిల్, కోయంబత్తూరు నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. తమిళ వ్యతిరేక వైఖరి తీసుకున్నందుకు గవర్నర్ రవిని వెనక్కి పిలిపించాలని వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు.