రాజస్థాన్‌లోనూ మతమార్పిడి నిరోధక బిల్లు

Feb 4,2025 00:17 #Anti-Conversion Bill, #Rajasthan

శ్రీ మతం మారితే పదేళ్ల జైలుశిక్ష.. భారీగా జరిమానా.
జైపూర్‌ : రాజస్థాన్‌లోనూ మత మార్పిడులను నిరోధించే బిల్లును తీసుకొచ్చారు. సోమవారం అంసెబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును భజన్‌ లాల్‌ శర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాజస్థాన్‌ చట్టవిరుద్ద మతమార్పిడి నిషేధ బిల్లు 2024 (రాజస్థాన్‌ ప్రోహిబిషన్‌ ఆఫ్‌ అన్‌ లాఫుల్‌ కన్వర్షన్‌ ఆఫ్‌ రిలిజియన్‌ బిల్లు 2025) ను మంగళవారం అసెంబ్లీలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ ఖింవ్సార్‌ ప్రవేశపెట్టారు. గతేడాది అంటే 2024 నవంబర్‌లో ఈ బిల్లు ముసాయిదాను కేబినెట్‌ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు దాదాపు రెండు నెలల ముందు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తాము మత మార్పిడి చేసుకోవాలని తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారి ముందు ఒప్పుకోవాల్సి ఉంది. ఇందులో ఎవరి బలవంతం కానీ.. ఎవరి ప్రోద్బలం కానీ లేదని తెలుపాలి. అనంతరం మత మార్పిడికి అనుమతి లభిస్తుంది.
ఒకవేళ షెడ్యూల్‌ కులాలు, తెగలకు చెందిన వారితోపాటు మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే.. రెండు నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.25 వేల వరకు జరిమానా సైతం విధించే విధంగా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బిజెపి చేస్తున్న ప్రచారంలో ఇది భాగమని విమర్శించింది. కాగా, ఇప్పటికే కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మత మార్పడి నిరోధక బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.

➡️