ఆలయ ప్రవేశం కోసం 30 దళిత కుటుంబాల ఆందోళన

  • సాంఘిక బహిష్కరణతో ఇబ్బందులు

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్దమాన్‌ జిల్లాలో 130 దళిత కుటుంబాలు నేటికీ కులవివక్షను ఎదుర్కొంటున్నాయి. కులం ప్రాతిపదికగా ఆలయ ప్రవేశానికి పెత్తందారులు అడ్డుచెబుతుండటంతో వారు ఆందోళనబాటపట్టారు. గిద్‌గ్రామ్‌ గ్రామంలోని దాస్‌పరా ప్రాంతంలో గిదేశ్వర్‌ శివాలయం ఉంది. ఆ ప్రాంతంలో అదొక్కటే ఆలయం. చర్మపు వస్తువుల తయారీ, నేత పని చేస్తున్న ‘దాస్‌’ ఇంటి పేరున్న వారిని తక్కువ కులంగా చూస్తూ, ఆ ఆలయంలోకి అనుమతించడం లేదు. సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ ఆలయం స్థాపించినప్పటి నుంచీ కులవివక్ష కొనసాగుతోందని గ్రామస్థులు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25కు విరుద్ధంగా ఉన్న ఈ వివక్షకు చరమగీతం పాడాలని, ఆలయంలో ప్రవేశించే హక్కును కల్పించాలని దళితులు డిమాండ్‌ చేస్తున్నారు.

పోలీసుల మధ్యవర్తిత్వం విఫలం

దాస్‌ కుటుంబాలు ఆలయంలో ప్రార్థన చేయడానికి వీలుగా పోలీసులు, ప్రభుత్వాధికారులు ఫిబ్రవరి 28న మధ్యవర్తిత్వం వహించి, సమావేశం నిర్వహించారు. కట్వా, మంగల్కోట్‌ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాస్‌ కుటుంబాలకు ఆలయంలో ప్రార్థన చేయడానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కాగితాలకే పరిమితమైంది.

సాంఘిక బహిష్కరణ

దాస్‌ కుటుంబాలు ఆలయంలో ప్రార్థన చేయడానికి ప్రయత్నించిన తర్వాత వారిని సాంఘిక బహిష్కరణ చేశారు. ఎవరూ ఆర్థిక లావాదేవీలు నిర్వహించకుండా కట్టడి చేశారు. గ్రామంలోని పాడి కేంద్రాల్లో వారి పాలు కొనుగోలు చేయడం నిలిపివేయడంతో 30 నుంచి 40 కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి.

సంప్రదాయాలు ఉల్లంఘిస్తే అశాంతి : ఆలయ కమిటీ సభ్యుడు

ఆలయ కమిటీ సభ్యుడు దినబంధు మోండల్‌ మాట్లాడుతూ ”ఈ గ్రామంలో ఎవరూ ఈ పురాతన సంప్రదాయాన్ని ఉల్లంఘించాలనుకోవడం లేదు. వారు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, గ్రామంలో అశాంతి సృష్టించబడుతుంది. ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి,” అని అన్నారు.
నాటి నిర్ణయాలను

త్వరలో అమలు చేస్తాం : కట్వా ఎస్‌డిఒ

”ఫిబ్రవరి 28న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో అమలు చేస్తామని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని కట్వా ఎస్‌డిఒ అనిషా జైన్‌ తెలిపారు.

దాస్‌ కుటుంబాల నిర్ణయం

”ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తాం. కొల్‌కతా, ఢిల్లీలోని అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సమస్య పరిష్కారం కాకపోతే మా పూర్వీకుల కట్టుబాట్లను వదిలి వెళ్తాం” అని దాస్‌ కుటుంబాల ప్రతినిధి ఎక్కోరి దాస్‌ తెలిపారు. ”మేము శివునికి పూజలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా భద్రత కోసం భయపడి ఆలయంలోకి వెళ్లలేదు. ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి,” అని దాస్‌పరా నివాసి లిపి దాస్‌ తెలిపారు. ఈ వివక్షతను అంతం చేయడానికి ప్రభుత్వం, పోలీసులు ఎప్పుడు చర్యలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.

➡️