న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ ఘోరాల్లోనే కాదు.. బాల్య వివాహాల్లోనూ ఏపీ టాప్‌లో వుండటమే ఆందోళన కలిగించే విషయం. దేశవ్యాప్తంగా బాల్యవివాహాలు అత్యధికంగా జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, త్రిపుర, అస్సాం, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలతోపాటు, దేశంలో దాదాపు 300 జిల్లాల్లో జాతీయ సగటుతో పోలిస్తే బాల్య వివాహాల రేటు ఎక్కువగా ఉందని తాజాగా ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
భారత్‌లో వివాహ వయసు కంటే ఇంకా తక్కువ వయసులోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. దాదాపు ఐదుగురిలో ఒక అమ్మాయికి వివాహ వయసు కంటే ముందే పెళ్లి జరుగుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. బుధవారం జరిగిన ‘బాల్ వివాహ ముక్త్ భారత్’ ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దేశంలో బాల్య వివాహాలను తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలి. 2029 నాటికి బాల్యవివాహాల రేటు 5 శాతానికి తగ్గించేలా రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందించాలి. ఆ లక్ష్యం కోసం కృషి చేయాలి. ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి 18 ఏళ్లలోపే వివాహం జరుగుతున్నది. బాల్య వివాహాలు అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల్లో ఒకటి. చట్ట ప్రకారం నేరం కూడా. మన దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టం ఉంది. అయితే చట్టాలు మాత్రమే ఈ నేరాల్ని ఆపలేవు. సమాజంలో బాల్య వివాహాలపై అవగాహన పెంచేందుకు మనవంతుగా కృషి చేయాలి. ప్రపంచంలోనే దక్షిణాసియాలో బాల్య వివాహాల రేటు తక్కువగా ఉంది. గతేడాది దాదాపు రెండు లక్షల బాల్య వివాహాలు నిరోధించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం… దక్షిణాసియాలోనే బాల్యల వివాహాల రేటు తక్కువగా ఉంది. ఈ విజయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది’ అని ఆమె అన్నారు.
బాల్య వివాహాలను నిరోధించడంలో భాగంగానే ‘బాల్ వివాV్‌ా ముక్త్ భారత్’ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం బాల్య వివాహాలను నిరోధించడం, వీటిపై అవగాహన పెంచడానికి, ఈ కేసులను మోనిటర్ చేయడానికి పురోగతి సాధించేందుకే ప్రారంభిస్తున్నట్లు అన్నపూర్ణాదేవి వెల్లడించారు. భారత్ బాల్య వివాహాల విముక్తి దేశంగా ఉండాలని, దీనికి పౌరుల భాగస్వామ్యం కీలకమని ఆమె అన్నారు.