చారిత్రిక క్యాథలిక్‌ చర్చి ట్రస్టీగా తొలిసారి మహిళ నియామకం

అలప్పుజా : ప్రగతిశీల, అభ్యుదయ భావాలకు నిలయమైన కేరళలో మరో ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 165 ఏళ్ల చరిత్ర కలిగిన క్యాథలిక్‌ చర్చిలో ట్రస్టీగా తొలిసారి ఒక మహిళను నియమించారు. సాధారణంగా చర్చిలో ఈ ట్రస్టీ బాధ్యతలను పురుషులే నిర్వహించడం ఇప్పటి వరకూ అనవాయితీగా వస్తోంది. దీనికి భిన్నంగా అలప్పుజా పట్ణణ శివారుల్లో ఉన్న అవర్‌ లేడీ ఆఫ్‌ అజంప్షన్‌ చర్చి ట్రస్టీగా 39 ఏళ్ల సుజా అనిల్‌ను నియమించారు. దీంతో ఈ వారం ప్రారంభంలో జరిగిన కార్యక్రమంలో మరో ఇద్దరు పురుష ట్రస్టీలతో పాటు సుజా అనిల్‌ కూడా బాధ్యతలు స్వీకరించారు. కేరళలోని క్యాథలిక్‌ చర్చిల్లో ట్రస్టీగా ఒక మహిళను నియమించడం ఇదే మొదటిసారని ఫాదర్‌ జేవియర్‌ చెప్పారు. ట్రస్టీగా ఒక మహిళా నియామకాన్ని పరిగణించాలని పారిస్‌ పాస్టోరల్‌ కౌన్సిల్‌ను ఫాదర్‌ జేవియర్‌ గతంలో కోరారు. దీనికి అనుగుణంగా కొన్ని వారాల క్రితం కౌన్సిల్‌ చేసిన సిఫార్సుకు కొచ్చిన్‌ డియోసెస్‌ ఆమోదం తెలిపింది.

➡️